గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో సౌత్ సినిమాల హవా నడుస్తోంది. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అక్కడి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. దీంతో 2025లో కూడా మన హీరోలు హిందీలో జెండా పాతేస్తారని అంతా భావించారు. కానీ సీన్ కట్ చేస్తే ఫలితాలు చూసి ట్రేడ్ వర్గాలే షాక్ అవుతున్నాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు నార్త్ ఆడియన్స్ ముందు చతికిలపడ్డాయి. స్టార్ డమ్ ఉంటే సరిపోదు, సత్తా ఉండాలని నిరూపిస్తూ ఒక్క సినిమా మాత్రమే అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1.
Bollywood
మిగతా స్టార్లందరూ చేతులెత్తేసిన చోట, రిషబ్ శెట్టి మాత్రం సత్తా చాటాడు. కన్నడ నేల నుంచి వచ్చిన ఈ సినిమా హిందీలో ఏకంగా 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీనికి ప్రధాన కారణం అందులోని నేటివిటీ. కదంబ కాలం నాటి కథ, దైవత్వంతో కూడిన క్లైమాక్స్ నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కేవలం కంటెంట్ ను నమ్ముకుంటే స్టార్ ఇమేజ్ తో పనిలేదని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.
ఇక భారీ అంచనాలతో వెళ్లిన మన పాన్ ఇండియా స్టార్లకు మాత్రం నిరాశే మిగిలింది. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’ హిందీలో కేవలం 25 కోట్లు మాత్రమే వసూలు చేయడం షాకింగ్ విషయం. శంకర్ బ్రాండ్ కూడా సినిమాను కాపాడలేకపోయింది. అటు రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ‘కూలీ’ కూడా 35 కోట్లతో సరిపెట్టుకుంది. స్టార్ డైరెక్టర్లు, భారీ క్యాస్టింగ్ ఉన్నా కథలో ఆ సోల్ మిస్ అయితే ఫలితం ఇలాగే ఉంటుందని అర్థమైంది.
మిడ్ రేంజ్ సినిమాల్లో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ పర్లేదు అనిపించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో సుమారు 15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక బాహుబలి రీ ఎడిట్ వెర్షన్ నోస్టాల్జియా వర్కవుట్ అయ్యి ఒక 6 కోట్లు రాబట్టింది. ఇవి ఓకే అనిపించుకున్నా, బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ విజయాలు మాత్రం కాదు. కానీ పెద్ద హీరోల సినిమాలతో పోలిస్తే ఇవి బెటర్ అనే చెప్పుకోవాలి.
అసలు షాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాల సినిమాలు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తేలేకపోవడం. పవన్ ‘ఓజీ’ అక్కడ 3 కోట్లు మాత్రమే రాబట్టగా, కమల్ ‘థగ్ లైఫ్’ కోటిన్నరకే పరిమితమైంది. సూర్య ‘రెట్రో’ అయితే 50 లక్షలు, బాలయ్య ‘అఖండ 2’ 65 లక్షలతో డిజాస్టర్లుగా మిగిలాయి. ప్రభాస్ క్యామియో ఉన్న ‘కన్నప్ప’, బాబీ డియోల్ ఉన్న ‘డాకు మహారాజ్’ కూడా హిందీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి.
దీన్ని బట్టి 2025 ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. హిందీ ఆడియన్స్ ఇప్పుడు రొటీన్ మాస్ మసాలా సినిమాలను, స్టార్ డమ్ ను గుడ్డిగా ఆదరించడం లేదు. కథలో ఎమోషన్, కొత్తదనం ఉంటేనే చూస్తున్నారు. పాన్ ఇండియా పేరు చెప్పి డబ్బింగ్ సినిమాలు వదిలితే ఇకపై కుదరదు. సౌత్ మేకర్స్ కు ఇదొక గట్టి రియాలిటీ చెక్ లాంటింది. కంటెంట్ మార్చుకోకపోతే 2026లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవ్వొచ్చు.
