SPARK Review in Telugu: స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విక్రాంత్ రెడ్డి (Hero)
  • మెహరీన్ కౌర్ పిర్జాదా (Heroine)
  • రుక్సార్ ధిల్లాన్, వెన్నెల కిశోర్, నాజర్, సుహాసిని, సత్య, అన్నపూర్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు (Cast)
  • డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ (Director)
  • లీలా రెడ్డి (Producer)
  • హేషమ్ అబ్దుల్ వాహాబ్ (Music)
  • ఏ ఆర్ అశోక్ కుమార్ (Cinematography)
  • Release Date : నవంబర్ 17, 2023

దీపావళి కానుకగా రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను అలరించింది లేదు. బాక్సాఫీస్ వద్ద కూడా అవి పెద్దగా సందడి చేసింది లేదు. దీంతో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల పై జనాల ఫోకస్ పడింది. ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ‘స్పార్క్’ అనే మూవీ పై కూడా జనాల ఫోకస్ పడింది. ఎందుకంటే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పాటలకి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ‘ఏం అందం’ అనే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. టీజర్, ట్రైలర్…లు కూడా చాలా కొత్తగా అనిపించాయి. మరి సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: లేఖ(మెహరీన్) కి నిత్యం ఓ కల వస్తూ ఉంటుంది. అందులో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆమె భావిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధాలు వద్దు అని క్యాన్సిల్ చేసుకుంటుంది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి అతన్ని వెతికే పనిలో పడుతుంది. ఓ హాస్పిటల్ లో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతను మరెవరో కాదు తన ఎదురింట్లో ఉంటున్న ఆర్య (విక్రాంత్ రెడ్డి) అని తెలుస్తుంది. ఈ క్రమంలో అతనికి తన ప్రేమ గురించి చెప్పగా.. అతను రిజెక్ట్ చేస్తాడు. మరోపక్క లేఖ స్నేహితులు ఊహించని విధంగా తమకి అయిన వాళ్ళని చంపేసుకుని..

తరువాత వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. అయితే ఈ చావులకి కారణం హీరో అని లేఖ తండ్రి ఆరోపిస్తాడు.అలాగే పోలీసులు కూడా ఇతని కోసం గాలిస్తూ ఉంటారు. నిజంగా ఆర్య ఈ మర్డర్స్ చేశాడా? లేదంటే వారిని చంపింది దెయ్యమా? అసలు ఆర్య గతం ఏంటి? అసలు అతని ప్రియురాలు అనన్య(రుక్సార్ ధిల్లాన్) ఏమైంది? చివరికి ఆర్య ఈ మర్డర్ కేసుల నుండి ఎలా బయటపడ్డాడు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: డెబ్యూ మూవీ అయినప్పటికీ విక్రాంత్ చాలా బాగా నటించాడు. రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలు పోషించడమే కాకుండా… ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించి మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు.ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం అంటే మాటలు కాదు. అతనికి అన్ని విధాలుగా ఫుల్ మర్క్స్ పడతాయి. ఇక మెహరీన్ స్క్రీన్ పై అందంగా కనిపించింది. పాటల్లో ఆమె కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక రుక్సర్ ధిల్లాన్ .. అనన్య పాత్రలో చాలా చక్కగా నటించింది.

ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. కథలో కీలక పాత్ర ఆమెదే అని చెప్పాలి. ఇక విలన్ గా చేసిన గురు సోమసుందరం పాత్ర అయితే చాలా స్టైలిష్ గా అలాగే ఎంటర్టైనింగ్ గా ఉంది. అలాగే నాజర్, అన్నపూర్ణ, సుహాసిని, శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. వెన్నెల కిషోర్,సత్య .. అక్కడక్కడ నవ్వులు పూయించారు. మిగిలిన నటీనటులు ఓకే.

సాంకేంతిక నిపుణుల పనితీరు: ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ‘స్పార్క్’ కి అన్నీ తానై చేశాడు విక్రాంత్ రెడ్డి. అతను ఎంపిక చేసుకున్న పాయింట్ చాలా కొత్తగా.. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంత మంచి పాయింట్ ను ఎంపిక చేసుకున్నా.. దానిని తెరపై ఆవిష్కరించే టైంలో చాలా మంది తడబడతారు. కానీ విక్రాంత్ అలాంటి పొరపాటు చేయలేదు. ఎన్నేళ్లు అతను ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశాడో తెలీదు కానీ.. పక్కాగా ఈ కథని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు.స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంది.

హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం సినిమాకి ఆయువు పట్టుగా నిలిచింది. పాటలు వినడానికి చూడటానికి కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి పేరు పెట్టనవసరం లేదు. సెకండ్ హాఫ్ లో విక్రాంత్ – మెహరీన్..ల మధ్య వచ్చే డ్యూయెట్.. కన్నుల విందుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువల విషయంలో లీలా రెడ్డి ఎక్కడా రాజీపడలేదు అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది.

విశ్లేషణ: కొత్త పాయింట్, ఆకట్టుకునే కథనం, ట్విస్ట్…లతో… ఈ (Spark) ‘స్పార్క్’ ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచుతుంది. కచ్చితంగా ఈ వీకెండ్ కి థియేటర్స్ లో చూడదగ్గ సినిమా.

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags