‘వి మేక్ ఎ లివింగ్ బై వాట్ వి గెట్.. బట్, వి మేక్ ఎ లైఫ్ బై వాట్ వి గివ్’ ప్రత్యూష ఫౌండేషన్ బ్రోచర్‌పై ఉన్న కొటేషన్. సమంత మనసులోని మాటకు అక్షర రూపం ఇది. ‘ఉన్నదాంతో మనం బతకగలం. కానీ మనం ఇచ్చిన దాంతో ఎదుటి వారి జీవితాలను నిలబెట్టగలం’ అని సమంత చెప్పే మాటలు చేతల్లోకి మారి ఏడాది కావొస్తోంది. మహిళలకు, పిల్లలకు ఎన్నో రకాల సేవలను అందించింది ప్రత్యూష ఫౌండేషన్. గతేడాది సమంత అనారోగ్యానికి గురైన సమయంలో ఆ మనసును తొలచిన ఆలోచనలే ఆమెను సేవామార్గం వైపు అడుగులు వేయించారు. ‘అన్నీ ఉన్నా.. మనిషి ఆరోగ్యం కుదుటపడాలంటే కాస్త ప్రేమ కావాలి. కానీ పేదవారికి ప్రేమతో పాటు డబ్బు ఉండాలి.. ఆదరణ చూపాలి’.. సమంత మదిలో మెదిలిన ఈ ఆలోచనలే ‘ప్రత్యూష ఫౌండేషన్’ టాగ్‌లైన్… సపోర్ట్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్.
రియల్ టార్గెట్..
చదువు.. ఆపై ఉద్యోగం.. లైఫ్ సెటిల్‌మెంట్.. ఈ టార్గెట్‌పై దృష్టి పెట్టిన యూత్ లైఫ్ బిజీ అయిపోయిందని ఫిక్సయిపోయింది. అలాంటి వారికి తీరిక కుదరని షెడ్యూల్‌లో ఓపిక కూడదీసుకుని సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇప్పటి యూత్ ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నారు ప్రత్యూష ఫౌండేషన్ కో-ఫౌండర్ డాక్టర్ మంజుల. ‘హీరోయిన్‌గా సమంత అందరికీ తెలుసు. కానీ ఏడాదిగా ఆమె చేస్తున్న సేవను అభినందిస్తున్నాను. సమంతతో కలసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమెన్ హెల్త్‌పై అవగాహన తరగతుల ఏర్పాటు, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలు సేకరించి వారికి వైద్యం చేయించడం, వీటితో పాటు మహిళా సాధికారికత కోసం కార్యక్రమాలెన్నో ఈ సంస్థ ద్వారా చేయుగలిగాం. మధ్యలో సమంతకు వచ్చిన ‘మేక్ ఎ విష్’ ఆలోచనను ఆచరణలో పెట్టడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది’ అని వివరించారు డాక్టర్ మంజలా అనగాని.
ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా తలసేమియా బాధితులకు రక్తం అందించే కార్యక్రమాలను కూడా నిర్వహించారు. సమంత ఫ్యాన్స్ స్వచ్ఛందంగా పాల్గొని ఈ రక్తదాన శిబిరాలను గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. అలాగే రెయిన్ బో, లివ్‌లైఫ్ ఆస్పత్రుల సాయంతో చేసే హెల్త్ క్యాంపెయిన్‌లకు కూడా పెద్ద ఎత్తున బాధితులు తరలి వస్తున్నారు. ఇక్కడ పది మందికీ చేయూతనిస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ సేవలను చెన్నైకి కూడా విస్తరింపజేయాలని సమంత కోరుకుంటున్నారు. ఆమె ఆశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం.