మీకు గుర్తుందా? ఒకప్పుడు టాలీవుడ్‌లో ఏదైనా కొత్త సినిమా మొదలవుతుంది, అందులో బాలీవుడ్ హీరోయిన్ నటించొచ్చు అనే చర్చ వస్తే టక్‌మని రెండు పేర్లు బయటకు వచ్చేవి. అవే పరిణీతి చోప్రా, శ్రద్ధా కపూర్. ఈ ఇద్దరిలో ఒకరి పేరు చెప్పేసి ఆ సినిమాలో హీరోయిన్ ఇమెనే అని చెప్పేసేవారు. ‘సాహో’ సినిమా వచ్చినప్పుడు కానీ శ్రద్ధా కపూర్ రూమర్ నిజమవ్వలేదు. ఆ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్‌వైపు చూడని శ్రద్ధ పేరు ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది.
అల్లు అర్జున్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. బన్నీ 23వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోంది. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ ప్రీప్రొడక్షన్, కాస్టింగ్ పనులను వేగవంతం చేశారట. అందులో భాగంగా హీరోయిన్‌ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. అలా శ్రద్ధా కపూర్ పేరు ఒకటి బయటకు వచ్చింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేటప్పుడు హీరోయిన్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అంటున్నారు.
హిందీలో శ్రద్ధా కపూర్ స్టార్ హీరోయినే కానీ.. ఫామ్‌లో లేని స్టార్ హీరోయిన్. సినిమాలు వరుసగా చేస్తోంది కానీ అవేవీ స్టార్ హీరోల సినిమాలు కాదు. అయితే ‘స్త్రీ’, ‘స్త్రీ 2’ సినిమాలు ఆమె ఇమేజ్‌ని బాగానే పెంచాయి. ఆ సినిమాలు ఆమె మీదనే నడుస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లే సాధించాయి. ప్రస్తుతం శ్రద్ధ చేతిలో ‘ఈత’ అనే సినిమా ఉంది. వితాభాయ్ మాంగ్ నారాయణగావోంకర్ అనే భారతీయ డ్యాన్సర్, నటి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
రెండేళ్ల క్రితం ‘స్త్రీ 2’ సినిమాతో వచ్చిన శ్రద్ధ ఆ తర్వాత ఏ సినిమాలూ ఓకే చేయలేదు. దీని బట్టి ఆమె సినిమాల ఎంపిక అర్థమవుతుంది. మరిప్పుడు మాస్ యాక్షన్ మూవీలో హీరోయిన్‌గా చేయడానికి ఒప్పుకుంటుందా అనేది చూడాలి.