శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!

కిషోర్ అనే యువ ప్రతిభాశాలి తెరకెక్కించిన “శ్రీకారం” అనే షార్ట్ ఫిలిమ్ కాన్సెప్ట్ నచ్చి.. దాన్ని సినిమాగా రూపొందించారు రామ్ ఆచంట-గోపీచంద్ ఆచంట. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కరోనా మరియు లాక్ డౌన్ కారణంగా వాయిదాపడి ఎట్టకేలకు ఇవాళ (మార్చి 11) విడుదలైంది. రైతు సమస్యల నేపధ్యంలో కాక భవిష్యత్ లో వ్యవసాయం అనేది ఎంత ముఖ్యం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో “గ్యాంగ్ లీడర్” ఫేమ్ ప్రియాంక కథానాయికగా నటించగా మిక్కీ జె.మేయర్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా యువ దర్శకుడు కిషోర్ కెరీర్ కి చక్కని “శ్రీకారం” చుట్టిందో లేదో చూద్దాం..!!

కథ: కార్తీక్ (శర్వానంద్) ఓ సక్సెస్ ఫుల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. బెస్ట్ ఎంప్లాయి ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గెలుచుకొని, అమెరికాకి వెళ్ళే ఆఫర్ ను అందుకుంటాడు. కార్తీక్ ఎదుగుదల చూసి తండ్రి (రావు రమేష్) పిత్రోత్సాహంతో సంబరపడుతుండగా.. “ఉద్యోగం మానేసి, వ్యవసాయం చేస్తాను” అంటూ లక్షల్లో సంపాదన, అమెరికా ఆఫర్ ను వదిలేసుకొని ఊరు వచ్చేస్తాడు కార్తీక్. కొడుకు నిర్ణయానికి స్థాణువైపోతాడు తండ్రి. ఉమ్మడి వ్యవసాయం అనే పద్ధతితో ఊర్లో ఉన్నవాళ్లను, ఊరి నుండి పని కోసం వలసపోయిన వాళ్లందరినీ తిరిగి రప్పించి వ్యవసాయం మొదలెడతాడు.

అయితే.. ఊరు మొత్తాన్ని ఆక్రమించుకొని ఊరికి “ఏకాంబరపురం” అనే పేరు పెట్టుకోవాలనే తాపత్రయంతో ఊగిపోయే ఏకాంబరం (సాయికుమార్) కార్తీక్ ఆలోచనలకు అడ్డుపడుతూ ఉంటాడు. ఇంతకీ కార్తీక్ “ఉమ్మడి వ్యవసాయం” సక్సెస్ అయ్యిందా? అందుకోసం అతడు పడిన శ్రమ ఏమిటి? అతడికి వచ్చిన అడ్డంకులను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది “శ్రీకారం” కథాంశం.


నటీనటుల పనితీరు: శర్వానంద్ కి ఈ తరహా పాత్రలు కొత్త కాదు. కార్తీక్ అనే పాత్రలో సహజంగా నటించి ఆకట్టుకున్నాడు. ఒక చక్కని మెసేజ్ ను నిజాయితీగా అందించాడు. “గ్యాంగ్ లీడర్”లో డైలాగులు తక్కువైనా తన స్క్రీన్ ప్ల్రెజన్స్, గ్లామర్ తో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో అటు నటనతో కానీ, స్క్రీన్ ప్రెజన్స్ తో కానీ ఆకట్టుకోలేకపోయింది. మరీ ఎక్కువగా చిక్కిపోవడం వల్లనో ఏమో కానీ.. ఈ అమ్మాయేనా “గ్యాంగ్ లీడర్”లో అంత అందంగా కనిపించింది అని షాక్ అయ్యేలా ఉంది అమ్మడు. సగటు రైతుగా రావు రమేష్ నటన రైతుల బాధలను ప్రతిబింబించింది. నరేష్, మురళీ శర్మ, సత్య, సాయికుమార్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఇంగ్లీష్ లో ఒక నానుడి ఉంది. “ది గయ్ హూ టోల్డ్ ది జోక్ లౌడర్ విల్ గెట్ మోర్ ఆడియన్స్ దేన్ ద గాయ్ హూ యాక్చువల్లీ క్రాక్డ్ ది జోక్”. అంటే.. ఒక జోక్ ను క్రియేట్ చేసినవాడికంటే ఆ జోక్ ను గట్టిగా చెప్పినవాడికే ఎక్కువ ఫలితం ఉంటుంది అని. “శ్రీకారం” విషయంలో అదే జరిగింది. నిజానికి “శ్రీకారం” కాన్సెప్ట్ “మహర్షి” ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవ్వడానికంటే ముందుది. అయితే.. ఇంచుమించు అదే కాన్సెప్ట్ తో వచ్చిన “మహర్షి” సూపర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత తమిళంలో అదే తరహా కథతో “భూమి” అనే సినిమా రావడం “శ్రీకారం” సినిమాకి పెద్ద మైనస్. ఆ రెండు సినిమాల్లో ఉన్నదే “శ్రీకారం” సినిమాలో కమర్షియల్ అంశాలను జోడించకుండా నిజాయితీతో చెప్పాడు కిషోర్. బాక్సాఫీస్ దగ్గర నిజాయితీ కంటే కమర్షియాలిటీకి స్కోప్ ఎక్కువ కాబట్టి “శ్రీకారం” బాక్సాఫీస్ రేసులో నెగ్గుకురావడం కాస్త కష్టమే.

దర్శకుడిగా తొలి చిత్రం కావడంతో కిషోర్ కథనం విషయంలో చాలా చోట్ల తడబడ్డాడు. ముఖ్యంగా సినిమాలో ఎంగేజింగ్ ఎలిమెంట్స్ అనేవి లేకుండాపోయాయి. అందువల్ల ధియేటర్ లో కూర్చుని “అన్నదాత” ప్రోగ్రామ్ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. మిక్కీ జే.మేయర్ అందించిన బాణీల్లో చిత్తూరు యాసలో పాడిన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. నేపధ్య సంగీతం విషయంలో చేతులెత్తేశాడు మిక్కీ. యువరాజ్ సినిమాటోగ్రఫీ లావిష్ గా ఉంది. అయితే.. ఫ్రేమింగ్స్ లో కొత్తదనం కొరవడింది. లైటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. అయితే.. షూటింగ్ కి లాక్ డౌన్ కారణంగా వచ్చిన గ్యాప్ ఎఫెక్ట్ కూడా అవుట్ పుట్ లో కనిపిస్తుంది.

విశ్లేషణ: ఒక మంచి కథకు, మంచి కథనం కూడా ఉండాలి. కథనంలో ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. ఆడియన్స్ ను ఏదో ఒక పాయింట్లో కథకు లేదా మూలకథలోని ఎలిమెంట్ కు కనెక్ట్ చేయాలి. ఈ విషయాలన్నిట్లో “శ్రీకారం” చతికిలపడింది. సినిమాలో, మూలకథలో ఉన్న నిజాయితీ ప్రేక్షకుల గుండెను తాకలేకపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా రైతు సమస్యల మీద సినిమాలు ఎక్కువగా వరుసబెట్టి వస్తుండడంతో ఒక మొనాటనీ క్రియేట్ అయిపోయింది. అది కుదా సినిమా జనాలకు ఆశించిన స్థాయిలో కనెక్ట్ అవ్వకపోవడానికి ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. “శ్రీకారం” ఇంకాస్త ముందు లేదా ఇంకొన్నాళ్ళ తర్వాత రావాల్సిన సినిమా. రాంగ్ టైమింగ్ లో రిలీజై రిజల్ట్ బెడిసికొట్టింది. లేదంటే బాక్సాఫీస్ నెంబర్లతో సంబంధం లేకుండా కనీసం “మంచి సినిమా” అనే ట్యాగ్ అయినా దక్కించుకోనేది. అలాగని మరీ తీసిపారేయాల్సిన సినిమా కూడా కాదు.

రేటింగ్: 2.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus