Sri Leela : ప్రస్తుత హీరోయిన్లలో తక్కువ కాలంలో స్టార్ గా ఎదిగిన భామ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పెళ్లి సందడి’ చిత్రంతో తన కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీలీల. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది ఈ భామ. అయితే AI వాడకంలో భాగంగా అసభ్య కంటెంట్ వలన తాను ఎదురుకుంటున్న సమస్య గురించి ‘X’ వేదికగా ఈ విధంగా స్పందించారు.
“నా చేతులు జోడించి ప్రతి సోషల్ మీడియా యూజర్‌ను ఒకటే అభ్యర్థన చేస్తున్నాను… AI పేరుతో జరుగుతున్న అర్థంలేని, బాధాకరమైన కంటెంట్‌కు మద్దతు ఇవ్వకండి. టెక్నాలజీని ఉపయోగించడం ఒకటైతే, దాన్ని దుర్వినియోగం చేయడం మరోటి. టెక్నాలజీలో వచ్చిన అభివృద్ధి మన జీవితాన్ని సులభం చేయడానికి ఉండాలి కానీ మరింత క్లిష్టం చేయడానికి కాదు.
బయట ఉన్న ప్రతి అమ్మాయి ఎవరో ఒకరి కూతురు, మనవరాలు, చెల్లి, స్నేహితురాలు లేదా సహోద్యోగి. కళను తన వృత్తిగా ఎంచుకున్నంత మాత్రాన ఆమెను తక్కువగా చూడకూడదు. భద్రత ఉందనే నమ్మకంతో, ఆనందాన్ని పంచే ఇండస్ట్రీలో భాగంగా ఉండాలనుకుంటున్నాం. నా బిజీ షెడ్యూల్ వల్ల ఆన్‌లైన్‌లో జరుగుతున్న చాలా విషయాలు నాకు తెలియలేదు. వాటిని నా దృష్టికి తీసుకువచ్చిన నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ఇప్పటివరకు చిన్న విషయాలను పట్టించుకోకుండా నా లోకంలో నేనే బ్రతికాను కానీ ఇది మాత్రం చాలా కలవరపెట్టే, మనసును కలచివేసే విషయం.
ఇలాంటి పరిస్థితులు నా సహచరులు కూడా ఎదుర్కొంటున్నారు. అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. గౌరవంతో, మర్యాదతో, నా ప్రేక్షకులపై నమ్మకంతో ఒకటే కోరుకుంటున్నాను… దయచేసి మా వెంట నిలబడండి. ఇక నుంచి ఈ విషయాన్ని సంబంధిత అధికారులు చూసుకుంటారు.” అంటూ చెప్పుకొచ్చారు.