‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో శ్రీకాంత్ (Srikanth) పాత్ర లుక్ వెనుక చాలా పెద్ద కథ ఉంది అంటూ ఆ మధ్య మన ‘ఫిల్మీ ఫోకస్’లో చదివే ఉంటారు. టీజర్‌లో శ్రీకాంత్ లుక్ చూశాక ఏదో కొత్తగా, లైవ్లీనెస్‌తో ఉంది అని అనిపించింది కానీ.. కారణం ఏంటబ్బా అనే విషయం మాత్రం తెలియలేదు. అయితే ఆ తర్వాత ఆ లుక్ వెనుక కథ బయటకు వచ్చింది. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు శ్రీకాంత్.
‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు, హైప్‌ను పెంచే విషయలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన లుక్కు కథ కూడా బయటకు వచ్చింది. తానెప్పుడూ ఊహించని ఓ గొప్ప అవకాశం ‘గేమ్ ఛేంజర్’ అని చెప్పిన శ్రీకాంత్.. శంకర్(Shankar) దర్శకత్వంలో పనిచేయడం ఓ గొప్ప అనుభవం అని చెప్పారు. ఇందులో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు.
‘గేమ్ ఛేంజర్’ సినిమాలో తన పాత్ర ఒకెత్తు అయితే, గెటప్ మరో ఎత్తు అని చెప్పారు శ్రీకాంత్. మేకప్ – లుక్ కోసం మా నాన్న ఫొటోను స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పారు. ఆ పాత్ర కోసం ప్రాస్థెటిక్ మేకప్ వేసుకోవడానికి రోజూ నాలుగు గంటలు పట్టేదని చెప్పారు. ప్రోస్థెటిక్ మేకప్‌తో నటించడం ఇదే తొలిసారి అని చెప్పిన ఆయన.. మేకప్ వేసిన వెంటనే ఆ పాత్ర హావభావాలు ఆటోమేటిగ్గా వచ్చేశాయని చెప్పారు.
మేకప్ వేసుకున్నాక నాన్నలా కనిపిస్తున్నానా లేదా అనేది మాత్రం చూసుకున్నా అని చెప్పారు. దాని కోసం ఓసారి గెటప్ వేసుకుని నేరుగా ఇంటికి వెళ్లారట. అప్పుడు వాళ్ల అమ్మ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఆమె స్పందన చూశాక గెటప్ ఎంత బాగా కుదిరిందో అర్థమైందట శ్రీకాంత్‌కు. ఇక అప్పన్న పాత్రలో రామ్ చరణ్ (Ram Charan) నటనను చూస్తే అంతా షాక్ అవుతారు అని హైప్ ఇచ్చారు శ్రీకాంత్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వస్తోంది.