నటి శ్రీనిజ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా మంచు విష్ణు ఎన్నికై ప్రమాణ స్వీకారోత్సవం చేసే సమయంలో మోహన్ బాబు గురించి మీడియా ఎదుట సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబు గురించి శ్రీనిజ చేసిన వ్యాఖ్యల వల్ల ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శాశ్వత సభ్యత్వం నుంచి నిరవధికంగా సస్పెండ్ చేయడం గమనార్హం. గత నెల 23వ తేదీన జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
అక్టోబర్ నెల 16వ తేదీన ‘మా’ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా శ్రీనిజ వ్యవహరించారంటూ ఈసీ షోకాజ్ నోటీసును పంపించడంతో పాటు మూడు రోజుల్లోగా శ్రీనిజ వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. అయితే శ్రీనిజ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈసీ శ్రీనిజపై వేటు వేయడం గమనార్హం. శాశ్వత సభ్యురాలిపై మంచు విష్ణు ప్యానల్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబు, నరేష్ ను బాధ పెట్టేలా శ్రీనిజ కామెంట్లు చేయడం వల్లే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
శ్రీనిజ విషయంలో ఈసీ తీవ్రమైన చర్య తీసుకోవడంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసీ సస్పెండ్ చేయడం గురించి శ్రీనిజ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే మందలించడం జరిగింది. అయితే కఠిన చర్యలు తీసుకుంటే మాత్రమే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని విష్ణు ప్యానల్ సభ్యులు భావించినట్లు సమాచారం.