SSMB29 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి ఈ షూటింగ్ హడావుడిలో పడి బాహుబలి ఎడిటింగ్ ను కూడా పక్కనపెట్టాడు. అయితే.. గత కొంతకాలంగా ఈ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం తెలియడం లేదు. అందులోనూ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ అవ్వడం లేదు అని తెలియడంతో.. ఎక్కడ జరుగుతుందబ్బా అనుకున్నారు అందరూ. అయితే.. ఇటీవల తన కుమార్తె సితార పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించడం కోసం షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ఇప్పుడు మళ్లీ షూటింగ్ పనిలో పడ్డాడు.
అయితే.. SSMB29 బృందం షూటింగ్ లొకేషన్ అప్డేట్ ను ఎంత సీక్రెట్ గా ఉంచాలి అనుకున్నా.. శ్రీలంక ఎయిర్ లైన్స్ కారణంగా అది అందరికీ తెలిసిపోయింది. నిన్న సాయంత్రం మహేష్ బాబు హైదరాబాద్ నుంచి కొలంబో వెళ్లాడు. అక్కడ ఎప్పట్లానే ఫ్లైట్ క్రూతో ఫోటో దిగాడు. అయితే.. ఆ క్రూ చాలా సైలెంట్ గా మహేష్ బాబు తమ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించడం ఆనందంగా ఉందని చెబుతూ.. ఆయన హైదరాబాద్ నుంచి కొలంబో వెళ్తున్నట్లు ప్రకటించేశారు.
దాంతో SSMB29 షూట్ నెక్స్ట్ షెడ్యుస్ కొలంబోలోనే అని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఎవరు నటించనున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ లు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రం ఎనౌన్స్ మెంట్ కానీ.. టీజర్ కానీ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో పార్ట్నర్ షిప్ కంప్లీట్ అయ్యాకే వస్తుందని వినికిడి.
సో మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకొన్నాళ్లు ఇలా ఎయిర్ పోర్ట్ లుక్స్ తోనే సరిపెట్టుకోవాలన్నమాట. ఇకపోతే.. మహేష్ బాబు ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తోనూ ఓ సినిమా కోసం టాక్స్ లో ఉన్నాడని, రాజమౌళి సినిమా అనంతరం ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా ఉండబోతోందని టాక్ నడుస్తోంది.