గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. రీసెంట్ గా మరో విషాద వార్త షాక్ కి గురి చేసింది. బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసిఫ్ బాస్రా (53) ఆత్మహత్య కలకలం రేపింది. అయితే ఆసిఫ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తెలియలేదు. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలోని ధర్మశాల కేఫ్ సమీపంలో ఆసిఫ్ ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఒక ప్రయివేట్ గెస్ట్ హౌస్ లో ఆయన ఉరివేసుకొని చనిపోయినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టంకి తరలించారు. పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ బృందం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. తన పెంపుడు కుక్కకి సంబంధిచిన గొలుసుతోనే ఆసిఫ్ ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. కొన్నాళ్లుగా యూకేకి చెందిన మహిళతో సహజీవనం చేస్తోన్న ఆసిఫ్ డిప్రెషన్ తో బాధ పడుతున్నాడని ప్రాథమిక విచారణలో తెలిసింది.
ఆయన మరణవార్త విన్న బాలీవుడ్ ప్రముఖులు షాక్ అవుతున్నారు. నమ్మశక్యంగా లేదని.. ఈ చేదు వార్త నిజం కాకూడదని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. టీవీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆసిఫ్ పలు చిత్రాల్లో కూడా నటించారు. ‘పాతాళ్‌లోక్’, ‘జబ్ వి మెట్’, ‘కై పో చే’, ‘క్రిష్ 3’, ‘ఏక్ విలన్’ వంటి సినిమాలు ఆయనకి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. ఒక హాలీవుడ్ సినిమాలో కూడా ఆయన నటించారు.