మలయాళ సినిమా పరిశ్రమ చరిత్రలో ఎప్పుడూ లేనంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. పరిశ్రమలో మహిళల దయనీయ స్థితి గురించి వివరిస్తూ జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు బయటకు వచ్చింది మొదలు ఇదే పరిస్థితి. దశాబ్దం క్రితం జరిగిన విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీంతో చాలామంది పేర్లు ఈ చర్చలో వస్తున్నాయి. అలా వచ్చిన పేర్లలో నటుడు జయసూర్య (Jayasurya) ఒకటి. గత కొన్ని రోజులుగా ఈయన పేరు చర్చల్లో ఉంది. తాజాగా ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు.
ముఖేశ్, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు, జయసూర్యపై మాలీవుడ్‌లో వేధింపుల విమర్శలు వచ్చాయి. వారి వల్ల తాను ఇబ్బందులకు గురయ్యాని ఇటీవల ఓ నటి ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంలోనే జయసూర్య స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఆయన న్యాయపరంగా పోరాడతానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్‌లో రాసుకొచ్చారు. పుట్టిన రోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెబుతున్న వారికి, నాకు గత కొన్ని రోజులుగా మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు.
నా వ్యక్తిగత పరిస్థితుల కారణంగా నేను, నా కుటుంబసభ్యులు ఇప్పుడు ఆమెరికాలో ఉన్నాం. ఈ సమయంలోనే నాపై రెండు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇవి నాకు, నా కుటుంబసభ్యులకు, నా సన్నిహితులకు, సన్నిహితులకు బాధను కలిగించాయి. వీటిపై నేను న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నా అని చెప్పారు. మనస్సాక్షి లేనివారు తప్పుడు ఆరోపణలు చేయడం సులభం. ఆ ఆరోపణలను ఎదుర్కోవడం ఎంతో బాధాకరమని వారు కూడా గ్రహిస్తారని ఆశిస్తున్నాను.
అబద్ధం ఎప్పుడూ నిజం కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. కానీ, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని నమ్ముతున్నా అని జయసూర్య (Star Actor) తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. త్వరలోనే కేరళకు వచ్చి, నిర్దోషినని నిరూపించుకుంటానని.. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పారు. 2013లో ఒక ప్రాజెక్టు కోసం పని చేస్తున్నప్పుడు జయసూర్యతో (Star Actor) పాటు ముఖేశ్, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ నటి ఆరోపించిన విషయం తెలిసిందే.