సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. ఈ ఏడాది ఆరంభంలో దర్శకురాలు అపర్ణ మల్లాది గుండెపోటుతో మరణించారు. అటు తర్వాత సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని వంటి వారు కన్నుమూశారు. ఆ విషాదాల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో నటుడు కన్నుమూసినట్టు తెలుస్తుంది. తమిళ సినిమా పరిశ్రమలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. తమిళ నటుడు జయశీలన్ (Jayaseelan) ఈరోజు మృతి చెందారు. ఆయన వయసు 40 ఏళ్ళు మాత్రమే కావడం విషాదకరం. గత 2 నెలల నుండి అతను కామెర్లతో బాధపడుతూ వస్తున్నాడట. ఈ క్రమంలో అతన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని స్టాన్లీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో.. అత్యవసర చికిత్స అందిస్తున్న టైంలో జయశీలన్ కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఈ సంఘటన ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా చేస్తుంది.
వణ్ణారపేటలోని ఆయన నివాసంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. 100 కి పైగా సినిమాల్లో నటించిన తమిళ నటుడు జయశీలన్..కు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వంటి స్టార్ హీరోలతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది.అతను ఎటువంటి వివాదాల్లో తలదూర్చేవాడు కాదట. ‘అలాంటి మంచి వ్యక్తి చనిపోవడం బాధాకరం’ అని అతని స్నేహితులు చెప్పుకొస్తున్నారు. ధనుష్ (Dhanush) నటించిన ‘పుదుపేట్టై’ (Pudhupettai), విజయ్ (Vijay Thalapathy) నటించిన ‘తేరి’ (Theri), బిగిల్ (Bigil), విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందాడు జయశీలన్.