తరాలు మారుతున్నా.. మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నా కానీ ఇంకా మహిళలు అన్ని చోట్లా వేధింపులకు గురవుతూనే ఉన్నారు.. సినిమా రంగంలో హీరోయిన్ల మొదలు క్యారెక్టర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, జూనియర్ ఆర్టిస్టులు.. అందరూ ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారే.. తమని ఇబ్బందులకు గురి చేసిన వారిపై బహిరంగంగా కామెంట్స్ చేశారు కొందరు హీరోయిన్లు.. ఈ నేపథ్యంలో హాలీవుడ్లో స్టార్ట్ అయిన మీటూ ఉద్యమం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే..
తెలుగు ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఉదంతాలు చాలా వెలుగులోకి వచ్చాయి.. నటీమణులు కొందరు వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తనను ఎలా టార్చర్ చేసేవాడో ఒకప్పటి నటి, ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ వివరించింది.. అతణ్ణి ఒక లైంగిక ఉన్మాదిగా అభివర్ణించింది. తనను సిగరెట్లతో కాల్చుతూ హింసించాడని ఆరోపణలు చేసింది.. ఈ న్యూస్ మర్చిపోకముందే.. మరో స్టార్ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి షేర్ చేసుకున్న న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది..
ఐశ్వర్య లక్ష్మీ.. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ తో పాటు ‘అమ్ము’ లో నటించింది. విష్ణు విశాల్ హీరోగా, ఐశ్యర్య హీరోయిన్గా మాస్ మహారాజా రవితేజ నిర్మించిన ‘మట్టి కుస్తీ’ బాగా ఆడుతోంది.. తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె మాట్లాడడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ‘‘నా చిన్నతనంలో ఒకసారి కేరళలోని గురువాయూర్ టెంపుల్కి వెళ్లాం. అప్పుడు ఓ యువకుడు గుడిలోనే నా ప్రైవేట్ పార్ట్స్ తాకాడు.
అదీకాక చాలా దురుసుగా ప్రవర్తించాడు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. ఆ రోజు జరిగిన ఆ సంఘటనను ఈ రోజు వరకు కూడా మర్చిపోలేక పోతున్నాను. ఇక ఆ సమయంలో నేను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నా. ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు పసుపు కలర్ డ్రెస్సులు వేసుకోవాలి అంటేనే చాలా భయం వేసేది.. కానీ ఇప్పుడా భయం లేదు’’ అని చెప్పుకొచ్చింది మలయాళ స్టార్ హీరయిన్ ఐశ్వర్య లక్ష్మీ..