ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కి సంబంధించిన కేసుల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులపై కేసు నమోదవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలో చోటుచేసుకుంది. ముంబై శివార్లలో జరిగిన ఓ రేవ్ పార్టీపై ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు దాడులు జరిపారు. తీరంలోని క్రూజ్ షిప్ లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ సమాచారం రావడంతో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తన బృందంతో కలిసి రేవ్ పార్టీపై దాడి చేశారు.
పార్టీలో మత్తుపదార్ధాలను వినియోగిస్తున్నట్లు గుర్తించిన ఎన్సీబీ అధికారులు అధిక మొత్తంలో కొకైన్, ఎండీను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో హర్యానా, ఢిల్లీకి చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు గంటల సుదీర్ఘ ఆపరేషన్ తరువాత స్టార్ హీరో కొడుతో సహా పది మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం ఉదయం వారిని ముంబైకి తీసుకురానున్నారు. ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇంతకముందు కూడా ఇలాగే సైకోట్రోపిక్ పదార్ధాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలి సోదరుడు అగిసిలాస్ డెమెట్రియాడ్స్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తి, దీపికా పదుకోన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ సహా చాలా మంది ప్రముఖులను ఫెడరల్ యాంటీ-నార్కోటిక్స్ ఏజెన్సీ విచారించింది.