థ్రిల్లర్ సినిమా ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఆ థ్రిల్‌ను ఎలా పట్టి ఉంచి, ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తారు అనేదే ఇక్కడ పాయింట్. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు రవితేజ – సుధీర్ వర్మ. సినిమా విడుదలకు ముందు స్పాయిలర్స్ బయటికి రాకుండా చూసుకోవడం కష్టం. ఫస్ట్ షో తర్వాత సినిమాలో విషయం బయటకు వచ్చేస్తుంది అనుకోండి. అప్పటివరకు ఆపితే అదే పది వేలు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే సస్పెన్స్ వీడిపోయిన తర్వాత ఆడియన్స్ రిపీట్ అవ్వరు కాబట్టి.
ఈ విషయంలో ‘రావణాసుర’ టీమ్ ఇప్పటివరకు బాగానే హ్యాండిల్ చేస్తోంది. సినిమా టీజర్, ట్రైలర్‌లో ఎక్కడా అసలు విషయం చెప్పకుండా జాగ్రత్తపడింది. ఇదంతా మొదటి రోజు మొదటి ఆట చూసే ప్రేక్షకుల కోసమే అనేది మీకు తెలిసిన విషయమే. అయితే మొదటి ఆట కోసం నిర్మాతలు పెద్ద రిస్క్ చేయడం సరైనదేనా? ఏకంగా ఆ థ్రిల్ కోసం మిగిలిన భాషల్లో సినిమా విడుదల కాకుండా ఆపడం కరెక్టేనా? థ్రిల్లర్ జోనర్ సినిమాలకు పక్క మార్కెట్లలోనూ క్రేజ్ ఉంటుందనే విషయం తెలిసిందే.
‘రావణాసుర’ టీమ్ (Sudheer Varma) మాత్రం ముందు తెలుగులో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడమే తమ పని అని చెబుతోంది. ‘‘హిందీ, తమిళంలోనూ ‘రావణాసుర’ రిలీజ్ చేయాలని అనుకున్నాం. దాని కోసం 15 రోజుల ముందే కాపీ ఇవ్వాలి, అలా ఇస్తే అసలు విషయం బయటకు వచ్చేస్తుంది. అందుకే ఇవ్వలేదు’’ అని సుధీర్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే సస్పెన్స్ రివీల్ చేయొద్దని మొదటి షో చూసిన ప్రేక్షకులకు చెబుతారా? అనే ప్రశ్నకు సమాధానం సరిగ్గా రాలేదు. రాదు కూడా.
సినిమా కోసం ఇంత రిస్క్ అవసరమా అని అడిగితే.. ‘‘అన్ని సినిమాలు ఒకేలా చేస్తున్నారని అంటుంటారు. కొత్తగా చేస్తే ఎందుకు ఇలాంటి రిస్క్ అని మీరే అంటారు. ఈ సినిమా రిస్కే. కథ విన్నాక మాకెలాంటి ఆసక్తి కలిగిందో, ఆ అనుభూతి ప్రేక్షకులకు కూడా కలగాలి అనేది మా ఉద్దేశం’’ అని చెప్పారు సుధీర్ వర్మ .