ఈ ఏడాది రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించారు సుకుమార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమా కలక్షన్ల వర్షంతో పాటు ప్రశంసల జల్లు కురిపిస్తోంది. దీంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సుకుమార్ ఆసక్తికర విషయం చెప్పారు. ‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్‌ని చూసి చాలా కోపం వచ్చేదని వెల్లడించారు. ఎందుకు కోపం వచ్చేదో.. అతని మాటల్లోనే .. ” నేను హీరోలకు కథంతా మూడు గంటలు చెప్తూ ఉండేవాడిని. విజయేంద్ర ప్రసాద్ గారు 20 నిమిషాల్లో మొత్తం కథంతా చెప్పేవారు.
ఏ హీరోకి అయినా.. ఎంత పెద్ద కథ అయినా 20 నిమిషాల్లో పూర్తవుతుంది. ఎలా ఈ పెద్దాయన ఇన్ని కథలు కన్సివ్ చేయగలుగుతున్నారు. ఎంత ఫాస్ట్‌గా చెప్పగలుగుతున్నారు అని కోపంతో లోపల రగిలిపోయాను. అలా చెప్పాలని తపించాను. చివరికి విజయేంద్రప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నాను. రంగస్థలం కథను రామ్ చరణ్ కి 20-25 నిమిషాలు అవుట్ లైన్ ఇలా ఉంటుందని నెరేట్ చేశాను. ఇలా చెప్పడం ఇదే తొలిసారి.” అని వివరించారు.