కొన్నాళ్ల క్రితం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకి, కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ లాంటి నారా రోహిత్ అనంతరం వరుస పరాజయాల కారణంగా సరైన హిట్ లేక రేసులో వెనుకబడిపోయాడు. 2019 తర్వాత తీసుకున్న గ్యాప్ కారణంగా ఏకంగా 5 ఏళ్లపాటు సినిమాలకి దూరంగా ఉన్నాడు. నిజానికి నారా రోహిత్ కమ్ బ్యాక్ సినిమా అవ్వాల్సిన “సుందరకాండ” కాస్త డిలే అవ్వడంతో “భైరవం” ముందుకు వచ్చింది. అయితే ఎట్టకేలకు “సుందరకాండ”ను వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ:
తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఓ 5 క్వాలిటీల కోసం గాలిస్తుంటాడు సిద్ధార్థ్ (నారా రోహిత్). ఎన్నో సంబంధాలు పోగొట్టుకున్న తర్వాత, ఆఖరికి జుట్టుకి రంగు వేసుకొనే స్టేజ్ కి వచ్చాక వయసులో తనకంటే చాలా చిన్నదైన ఐరా (విర్తి వఘాని)ని చూసి ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.
కట్ చేస్తే.. తన పెళ్లికి తన సీనియర్ & స్కూల్ స్టేజ్ లో లవ్ చేసిన వైష్ణవి (శ్రీదేవి విజయ్ కుమార్) అడ్డంకిగా నిలుస్తుంది.
అసలు వైష్ణవి ఎవరు? సిద్ధార్థ్ పెళ్లికి అడ్డంకిగా ఎలా మారింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “సుందరకాండ” చిత్రం.
నటీనటుల పనితీరు:
నారా రోహిత్ మరోసారి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ తో రోహిత్ మార్క్ ఎలా ఉంటుందో తెలియనిది కాదు. అయితే.. ఫైట్ సీన్స్ లో మాత్రం అస్సలు ఒళ్ళు అలవకుండా నిల్చున్న చోటే ఫైట్లు చేయడం అనేది మాత్రం తగ్గిస్తే బెటర్. రోహిత్ ను ఇంకా యంగ్ హీరోగానే కన్సిడర్ చేస్తారు జనాలు. అందువల్ల కాస్త యాక్టివ్ గా ఉంటే బాగుంటుంది.
చిన్నప్పుడే సీరియల్ నటిగా అందరినీ విశేషంగా ఆకట్టుకున్న విర్తి వఘాని, ఈ చిత్రంతో తెలుగులో మంచి హీరోయిన్ గా సెటిల్ అవ్వడం ఖాయం. డైలాగ్ లిప్ సింక్ మొదలుకొని ఎక్స్ ప్రెషన్స్ & ఎమోషనల్ సీన్స్ లో పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కథకు కావాల్సిన ఆ చిన్నపిల్ల మనస్తత్వాన్ని చక్కగా తెరపై పండించింది.
శ్రీదేవి విజయ్ కుమార్ తెరపై భలే అందంగా కనిపించింది. ఆమె పాత్రతో వచ్చే ట్విస్ట్ ను డీల్ చేసిన విధానం కూడా బాగుంది. శ్రీదేవికి ఈ చిత్రం మంచి కమ్ బ్యాక్ ఫిలింగా నిలుస్తుంది. కాకపోతే.. ఇకపై ఆమెను తల్లి లేదా అత్త పాత్రలకు పరిమితం చేయకపోతే చాలు.
సత్య కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. అతను నాన్ సింక్ లో వేసే డైలాగ్స్ భలే పేల్తాయి.
సునయన, నరేష్, అభినవ్ గోమటం, రూపా లక్ష్మి, వాసుకి ఆనంద్ ల పాత్రలు కథనానికి ఉపయోగపడ్డాయి.
సాంకేతికవర్గం పనితీరు:
ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది కానీ.. డి.ఐ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ముఖ్యంగా కలరింగ్ విషయంలో సరైన జాగ్రత్తపడని కారణంగా కొన్నిచోట్ల ఫ్రేమ్స్ బ్రైట్ గా, కొన్ని డార్క్ గా ఉంటాయి. ఆ విషయంలో ప్రొడక్షన్ టీమ్ ఖర్చుకు వెనుకాడకుండా ఉండాల్సింది.
లియోన్ జేమ్స్ బాణీలు బాగున్నా.. ఎక్కడో విన్నట్లుగా ఉన్నాయి. అయితే ఆ పాటల చిత్రీకరణ మాత్రం బాగుంది. సాంగ్స్ ను మాంటేజ్ గా షూట్ చేయడం వల్ల ఇదే ప్లస్ పాయింట్. జనాలు బోర్ కొట్టి ఫోన్లు చూడకుండా ఆ పాటల్ని, సందర్భాన్ని ఆస్వాదిస్తారు.
దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఆలోచనాధోరణిని మెచ్చుకోవాలి. ఎందుకంటే.. ఈ కాన్సెప్ట్ ను చాలా సెన్సిబుల్ గా డీల్ చేశాడు. ఏమాత్రం అటు ఇటు అయినా నవ్వులపాలు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకు ఏమాత్రం స్కోప్ ఇవ్వకుండా ఒక డేరింగ్ సబ్జెక్ట్ ను చాలా సెన్సిబుల్ గా డీల్ చేశాడు. ఈ తరహా కాన్సెప్ట్ ను మనం ఇదివరకు వెస్ట్రన్ మూవీస్ లో చూసాం. కానీ.. ఇండియాలో, ముఖ్యంగా తెలుగులో ఈ తరహా కాన్సెప్ట్ ను ఇంత నీట్ గా డీల్ చేయడం అనేది దర్శకుడి ప్రతిభకు తార్కాణం. సరిగ్గా ప్లాన్ చేసుకోగలిగితే.. ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి మంచి దర్శకుడు అవుతాడు వెంకటేష్ నిమ్మలపూడి.
ప్రొడక్షన్ టీమ్ ఎఫర్ట్స్ ను కూడా మెచ్చుకోవాలి. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. కామెడీ వాటిని కవర్ చేసింది.
విశ్లేషణ:
క్లీన్ కాన్సెప్ట్ సినిమాలు ఈమధ్యకాలంలో చాలా తగ్గిపోయాయి. అయితే కామెడీ లేదంటే యాక్షన్ లేకపోతే థ్రిల్లర్లు. ఇదే పంథాలో సాగుతోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇలాంటి తరుణంలో వచ్చిన ఒక సెన్సిబుల్ & క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ “సుందరకాండ”. సాధారణంగా మలయాళంలో లేదా మరాఠీ చిత్రాల్లో ఈ శైలి కాన్సెప్ట్స్ ను చూస్తూ ఉంటాం. అలాంటిది దర్శకుడు వెంకటేష్ “సుందరకాండ” కాన్సెప్ట్ ను డీల్ చేసిన విధానం, నారా రోహిత్ పెర్ఫార్మెన్స్, సత్య కామెడీ టైమింగ్ విశేషంగా ఆకట్టుకుంటాయి. అన్నిటికీ మించి కథలోని ట్విస్టును డీల్ చేసిన విధానం, దానికి ఒక ప్రాపర్ క్లోజర్ ఇచ్చిన తీరు కచ్చితంగా అలరిస్తాయి. తెలుగులో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులైంది. ఆ లోటు తీర్చిన చిత్రం “సుందరకాండ” అని చెప్పొచ్చు.
ఫోకస్ పాయింట్: సెన్సిబుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్!
రేటింగ్: 3/5