ఎప్పుడో ఓసారి విజయం, అప్పుడప్పుడు ఓ మోస్తారు సినిమా.. తరచుగా ఫ్లాప్‌లు కానీ.. ఆ హీరోకు వరుస ఛాన్స్‌లు అయితే వస్తుంటాయి. ఎలా వస్తుంటాయి, ఏంటా స్పెషల్ అనే మాటకు మనం సమాధానం చెప్పలేం కానీ.. ఇప్పుడు ఆయనకు లేటెస్ట్‌గా వచ్చిన బిరుదు గురించి మాత్రం చెబుతాం. గతంలో ఓ సీనియర్ నటుడికి ఉన్న ఆ బిరుదును రీసెంట్‌గా ఈయన పెట్టుకున్నారు. తొలి రోజుల్లో ఎందుకు, ఎలా అని అనుకున్నారంతా. ఇప్పుడు ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఆయనే సందీప్ కిషన్ (Sundeep Kishan).
శివరాత్రి సందర్భంగా ‘మజాకా’ (Mazaka) సినిమాతో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సందీప్ కిషన్. ఈ సందర్భంగా ఇటీవల విలేకర్లతో మాట్లాడాడు. ఈ క్రమంలో తన కొత్త ట్యాగ్ పీపుల్స్ స్టార్ గురించి చెప్పుకొచ్చారు. ఆ ట్యాగ్‌ను తనంతట తాను పెట్టుకున్నది కాదని, తనకు అభిమానుల నుండి వస్తున్న మద్దతు చూసి ఓ నిర్మాత సజెస్ట్ చేశారు అని చెప్పారు. ఆయన నిర్మాణంలో ఇప్పుడు ‘మజాకా’ తెరకెక్కింది. అవును అనిల్ సుంకరనే (Anil Sunkara) ఆ నిర్మాత.
తాను తమిళనాడుకి వెళ్లినప్పుడు తెలుగు హీరో అనే చెప్పుకుంటానని, అక్కడి ప్రేక్షకులు తనను స్వీకరించి ప్రేమని పంచారని చెప్పారు సందీప్ కిషన్. కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో చేతనైనంత సాయం చేశానని, తమిళనాడులో రూపాయి కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక సినిమాల సంగతి చూస్తే.. ధనుష్ తన 50వ సినిమా ‘రాయన్’లో (Raayan) పిలిచి మరీ పాత్ర ఇచ్చాడని చెప్పారు. థళపతి విజయ్ (Vijay Thalapathy) వాళ్ల అబ్బాయి జేసన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని చెప్పాడు.
అలాగే రజనీకాంత్ పక్కన కూర్చోబెట్టుకుని తన నటన గురించి చెబుతుంటారని ఆనంపడ్డాడు సందీప్. ‘రాయన్’ సినిమా తర్వాత అభిమానులు తన గురించి రీల్స్ చేయడం చూసి నిర్మాత అనిల్ సుంకర ఓ రోజు పీపుల్స్ స్టార్ అని పేరు పెట్టుకోమని సలహా ఇచ్చారని సందీప్ చెప్పాడు. అదే పోస్టర్‌పై వేశారని కూడా చెప్పారు. ఇదన్నమాట పీపుల్స్ స్టార్ ట్యాగ్‌లైన్ వెనుక ఉన్న కథ.