Border 2: ప్రెస్టీజియస్‌ సీక్వెల్‌కి సిద్ధమైన మొన్నీమధ్యే హిట్‌ కొట్టిన స్టార్‌ హీరో

  • June 14, 2024 / 08:01 PM IST

ఇండియన్‌ సినిమాలో ప్రతిష్ఠాత్మ చిత్రాలు అంటూ ఓ లిస్ట్‌ రాస్తే.. అందులో టాప్‌లో ఉండే అతి కొద్ది సినిమాల్లో ‘బోర్డర్‌’ ఒకటి. మన సైనికుల త్యాగాలు, వారి పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమిది. 27 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీకి షేక్‌ చేసింది. సన్నీ డియోల్‌, జాకీ ష్రాఫ్‌, సునీల్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఆ చిత్రం ఆ రోజుల్లో రూ. 10 కోట్లు పెడితే.. రూ.65 కోట్లు సంపాదించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది.

ఇండియా – పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను జేపీ దత్తా తెరకెక్కించారు. 27ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్‌ చేశాడు హీరో సన్నీ డియోల్‌. ఓ సైనికుడు 27 ఏళ్ల తర్వాత తన మాటను నిలబెట్టుకోవడానికి ‘బోర్డర్‌’లోకి తిరిగొచ్చాడు అని చెబుతూ సీక్వెల్‌ గురించి ఇంట్రో ఇచ్చారు.

భారీ బడ్జెట్‌తో వార్‌ ప్రాజెక్టుగా ఈ సినిమాను తెరకెక్కిస్తారట. అనురాగ్‌ సింగ్‌ రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రారంభమవుతుందని సన్నీ డియోల్‌ చెప్పారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ యువ హీరో ఆయుష్మాన్‌ ఖురానా కీలక పాత్రలో నటిస్తాడని భోగట్టా. అలాగే ఇతర భాషల నుండి కొంతమంది నటులు ఈ సినిమాలో భాగం అవుతారని చెబుతున్నారు. త్వరలోనే ఆ విషయాలు చెబుతారట.

సన్నీ డియోల్‌ ఇటీవల ‘గదర్‌’ సీక్వెల్‌తో వచ్చి రూ. 690 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. కేవలం రూ.60 కోట్లతో రూపొందిన ఈ సీక్వెల్‌ భారీ విజయాన్ని అందుకుంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే ఈసారి ‘బోర్డర్‌’ సీక్వెల్‌కు ఆయన రెడీ అయ్యారు అని చెబుతున్నారు. మరి ఈ సీక్వెల్‌ ఆయనకు ఎలాంటి ఫలితం ఇస్తుంది, ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి. ఒకవేళ ఇదీ విజయం సాధిస్తే.. సన్నీ డియోల్‌ను ఇక ఆపేవాళ్లే ఉండరు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus