Maharaja Review in Telugu: మహారాజా సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 14, 2024 / 11:25 AM IST

Cast & Crew

  • విజయ్ సేతుపతి (Hero)
  • మమతామోహన్ దాస్, సచన నమిదాస్ (Heroine)
  • అనురాగ్ కశ్యప్, అభిరామి (Cast)
  • నిథిలన్ స్వామినాథన్ (Director)
  • జగదీష్ పళనిస్వామి - సుధాన్ సుందరం (Producer)
  • అజనీష్ లోక్నాథ్ (Music)
  • దినేష్ పురుషోత్తమన్ (Cinematography)
  • Release Date : జూన్ 14, 2024

తెలుగు, తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ కలిగిన నటుడు విజయ్ సేతుపతి. తనదైన నటన, అత్యద్భుతమైన కథల ఎంపికతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం “మహారాజా”. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ ప్లే చేయడం మరో విశేషం. మరి “మహారాజా” ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగాడో చూద్దాం..!!

కథ: కళ్ల ముందే జరిగిన ఓ యాక్సిడెంట్ లో భార్యను పోగొట్టుకున్న మహారాజా (విజయ్ సేతుపతి), అదృష్టవశాత్తు బ్రతికిన తన కుమార్తె జ్యోతి (సచన నమిదాస్)ను అల్లారుముద్దుగా చూసుకుంటూ.. సెలూన్ షాప్ నడుపుతూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఒకానొక రోజు తమ ఇంట్లో ఎంతో జాగ్రత్తగా చూసుకొంటున్న లక్ష్మిని దొంగిలించారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. అసలు లక్ష్మి ఎవరో తెలిసి షాక్ అవుతారు పోలీస్ బృందం.

ఇంతకీ లక్షీ ఎవరు? మహారాజా ఎందుకని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు? ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు తెలుసుకున్న నమ్మలేని నిజాలేమిటి? అసలు మహారాజా కథ ఏమిటి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు.. అంతే ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో చెప్పిన సమాధానాల సమాహారమే “మహారాజా” చిత్రం.

నటీనటుల పనితీరు: విజయ్ సేతుపతి మరోసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. బాడీ లాంగ్వేజ్ మొదలుకొని మ్యానరిజమ్స్ వరకు ప్రతి విషయంలో పాత్రను అద్భుతంగా ఎలివేట్ చేశాడు. ఒక సగటు తండ్రి పడే తపన, వేదనను విజయ్ సేతుపతి తెరపై పండించిన తీరుకు కనెక్ట్ అవ్వని ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా ఆడపిల్లల తండ్రులు ఈ పాత్రకు మరింతగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా.. గుండెల్లో బోలెడంత బాధను దాచుకొని ఓ కట్టుకథను చెప్పే సన్నివేశంలో విజయ్ సేతుపతి కన్నీరు పెట్టించాడు. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.

విగ్ ఒక్కటే సెట్ అవ్వలేదు కానీ.. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ నటన కానీ.. స్క్రీన్ ప్రెజన్స్ కానీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ విగ్ ఒక్కటే లేకపోతే ఆడియన్స్ ను ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవారు. చిన్నారి సాచనా నమిదాస్ నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె కళ్ళల్లోని ధైర్యం.. ఎంతోమంది అమ్మాయిలకు మంచి స్ఫూర్తినిస్తుంది.

అరుల్ దాస్ పండించిన కామెడీ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుంది. వినోద్ సాగర్, మణికందన్, సింగంపులి పోషించిన పాత్రలు మనసులో చిన్నపాటి గగుర్పాటును కలిగిస్తాయి. అభిరామి, మమతామోహన్ దాస్, దివ్యభారతి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు నిధిలన్ స్వామినాథన్ ఎంచుకున్న మూలకథ ఇప్పటికే పలుమార్లు చూసేసినదైనప్పటికీ.. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ హృదయాన్ని కలచివేస్తుంది. అదే సమయంలో “కర్మఫలం” గూర్చి అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది. అయితే.. నిధిలన్ ఒక దర్శకుడిగా మాయ చేసింది మాత్రం తన స్క్రీన్ ప్లేతో. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథనం ఎలా రాయొచ్చు అనేందుకు భవిష్యత్ దర్శకులకు ఒక అద్భుతమైన రిఫరెన్స్ గా ఈ చిత్రం ఇప్పటికీ నిలిచిపోతుంది. రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్ ను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా.. చాలా ఒద్దికగా తెరపై చూపించిన తీరు ప్రశంసార్హం.

అలాగే.. క్లైమాక్స్ లో చిన్నారి అడుగులో రెడ్ డైమండ్ రిఫరెన్స్ తో సినిమాను ముగించిన తీరు చిన్నపాటి షాక్ ఇస్తుంది. అనురాగ్ కశ్యప్ ముందు ధైర్యంగా కూర్చొని చిన్నారి సచన నమిదాస్ మాట్లాడే సన్నివేశం ఈమధ్యకాలంలో ది బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు. అలాగే.. ఈ తరహా సినిమాలకు అవసరం లేని పాటలను జొప్పించకుండా.. రెండున్నర గంటలపాటు ఏమాత్రం ల్యాగ్ లేకుండా అలరించడం మరో విశేషం.

కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్ మరోసారి తనదైన శైలి నేపథ్య సంగీతంతో సినిమాలో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యేలా చేసి.. దర్శకుడి విజన్ ను అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ దినేష్ పురుషోత్తమన్ కూడా వీళ్లిద్దరి స్థాయిలోనే ఆకట్టుకున్నాడు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, రీరికార్డింగ్, డి.ఐ వంటివన్నీ సినిమాకు మరింత వేల్యూ యాడ్ చేశాయి.

విశ్లేషణ: ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం “మహారాజా” చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే. విజయ్ సేతుపతి నటన, అజనీష్ లోక్నాథ్, సినిమా కోర్ పాయింట్ & దర్శకుడు నిధిలన్ అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేసిన తీరు ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పుకోవాలి. చాలా సరదాగా మొదలైన ఓ సినిమా… రానురాను ఆసక్తి కలిగించి, ఒక్కసారిగా మనసు చివుక్కుమనేలా చేసే జోనర్ సినిమాలు ఈమధ్యకాలంలో రాలేదు. విజయ్ సేతుపతి 50వ సినిమా ఇప్పటికే గుర్తుండిపోయేలా చేసిన నిధిలన్ ను మెచ్చుకోవాలి!

ఫోకస్ పాయింట్: ప్రస్తుత సమాజం తప్పక చూడాల్సిన చిత్రం “మహారాజా”!

రేటింగ్: 3.5/5

Click Here To Read in ENGLISH

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus