కొన్నికథలు వినడానికి బాగున్నా, వెండితెరపై బాగుండవు. మరికొన్ని ఓ మోస్తరుగా ఉన్నా సినిమాగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ విషయాన్ని ముందుగా గ్రహిస్తే విజయాలు అతని ముందు వాలుతుంది. హిట్ కథలను ఎన్నుకోవడంలో పవన్ కళ్యాణ్ నేర్పరి. అతను పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో తను సూటయ్యే కథలను ఎంపిక చేసుకొని వరుసగా ఏడు విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డు తెలుగు సినీ పరిశ్రమలో పవన్ మాత్రమే సాధించాడు. జానీ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నతర్వాత నుంచి కథల ఎంపికలో తడబడ్డాడు. వరుసగా అపజయాలను చవి చూసాడు. ఈ క్రమంలో అతని వద్దకు మంచి కథలు వచ్చినా వాటిని తిరస్కరించాడు.
పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కి బద్రి సినిమా ద్వారా అవకాశం ఇచ్చాడు. ఆ అభిమానంతో పవన్ కోసం కొన్ని కథలను రాసుకున్నాడు. వాటిలో మొదటిది ఇడియట్. ఈ కథని పవన్ రిజెక్ట్ చేశాడు. దాంతో రవితేజ హిట్ అందుకున్నాడు. తర్వాత అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి కథను తొలిసారి పవన్ కే వినిపించాడు. బాక్సింగ్ కథతో ఇది వరకు తమ్ముడు సినిమాలో కనిపించడం వల్ల పవన్ దీనిని వద్దని చెప్పాడు. ఈ కథ మళ్ళీ రవితేజ కి వెళ్ళడం.. అతను మరో సూపర్ హిట్ ని అందుకోవడం జరిగిపోయాయి. అయినా పూరి జగన్నాథ్ నిరాశ పడలేదు. మరో మంచి కథని పవర్ స్టార్ కి వినిపించాడు. అతనిది సేమ్ డైలాగ్. రిజెక్ట్. ఆ కథే పోకిరి. మహేష్ ని ఏకంగా నంబర్ వన్ హీరోని చేసింది. ఈ మధ్యలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సారి పవన్ ని కలిసి “అతడు” సినిమా కథని చెప్పాడు. అతను నో అన్నాడు. మహేష్ ఎస్ అన్నాడు. ప్రేక్షకులు సూపర్ అన్నారు. ఆ తర్వాత మల్టీ స్టారర్ సినిమా కోసం కథను వినిపిస్తే పవన్ ఆసక్తి చూపించలేదు. మహేష్ సరే చెప్పడంతో ఆ కథ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గా విజయ సువాసనను వెదజల్లింది.
దీంతో పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కథను తిరస్కరిస్తే ఆ సినిమా హిట్టే అని ప్రచారం అందుకుంది. అందుకే అతను వద్దన్న కథను వినడానికి ఎవరూ నో చెప్పడం లేదు. హిట్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా.