సూపర్ ఓవర్ సినిమా రివ్యూ & రేటింగ్!

దివంగత దర్శకుడు ప్రవీణ్ వర్మ తెరకెక్కించిన చిత్రం “సూపర్ ఓవర్”. నవీన్ చంద్ర, చాందిని చౌదరి, రాకేందుమౌళి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆహా యాప్ లో నేడు విడుదలైంది. ఇదివరకు విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది, మరి సినిమా ఏస్థాయిలో అలరిస్తుందో చూద్దాం..!!

కథ: కాశి (నవీన్ చంద్ర), మధు (చాందిని చౌదరి), వాసు (రాకేందుమౌళి) మంచి స్నేహితులు. ఏం చేసినా కలిసే చేస్తారు, కలిసే ఉంటారు. అమెరికా వీసా కోసం ఇల్లు తాకట్టు పెట్టి 40 లక్షలు అప్పు చేస్తాడు కాశి, ఆ అప్పును అర్జెంట్ గా తీర్చాల్సి వస్తుంది. వేరే దారి లేకపోవడంతో క్రికెట్ బెట్టింగ్ చేస్తాడు. ఊహించని విధంగా 30 వేలతో మొదలెట్టి నెల రోజుల్లో 1.75 కోట్లు గెలుచుకుంటాడు. ఆ డబ్బును హవాలా రూపంలో తీసుకోవడానికి వెళ్లిన కాశి, మధు, వాసులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? చివరికి డబ్బు వారి సొంతమైందా లేదా అనేది ఆహా యాప్ లో ఈ వెబ్ ఫిలిం చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పనితీరు: నవతరం యువతగా నవీన్ చంద్ర, చాందిని చౌదరి, రాకేందుమౌళి చక్కగా ఒదిగిపోయారు. పోలీస్ పాత్రలో అజయ్, బుకీ అసిస్టెంట్ గా ప్రవీణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. తక్కువ పాత్రధారులు ఉండడం సినిమాకి ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. అందువల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు సన్నీ ఎం.ఆర్ & సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణిలు సినిమాకి అసలైన హీరోలు. వాళ్ళ పనితనంతో సినిమాకి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ దర్శకుడు లేని లోటును తీర్చేసాడు. చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతుంది అనే ఆలోచన వచ్చేలోపు ఎడిటింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ను డైవర్ట్ చేసేసాడు. అందువల్ల ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీల్ అవ్వలేదు. అయితే.. పాయింటాఫ్ వ్యూ స్క్రీన్ ప్లే వల్ల కొన్ని సన్నివేశాలు రిపీట్ అయినట్లు కనిపిస్తాయి కానీ.. పెద్దగా బోర్ కొట్టవు.

బేసిక్ గా సినిమాలో కొన్ని మెయిన్ లాజిక్స్ మిస్ అయ్యాయి, అది దర్శకుడు లేకపోవడం వల్ల అయ్యుండొచ్చు.

ఇక డైరెక్టర్ ప్రవీణ్ వర్మ తాను రాసుకున్న కథను నిర్మాత సుధీర్ వర్మ తెరకెక్కించిన “స్వామి రారా” ఫార్మాట్ లో తీయడం వలన కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపిస్తాయి. ఆ సినిమా గుర్తులేకపోతే ఆ బాధ ఉండదనుకోండి.

విశ్లేషణ: ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో సగటు ప్రేక్షకుడు కోరుకునే అన్ని రకాల హంగులు ఉన్న సినిమా “సూపర్ ఓవర్”. సింపుల్ స్టోరీ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ కెమెరా & మ్యూజికల్ వర్క్. సో, సరదాగా “సూపర్ ఓవర్”ను ఆహా యాప్ లో చూసేయొచ్చు. చిన్నపాటి లాజిక్స్ మిస్ అయ్యాయి కానీ.. వాటిని పెద్దగా ఖాతరు చేయక్కర్లేదు. చాందిని చౌదరి & నవీన్ చంద్రల కెరీర్ లకు ఈ సినిమా ఒక మంచి బూస్టర్ అవుతుంది.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus