సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి స్టార్ హీరోల దూకుడుకి బ్రేకులు వేసిన హీరో. వాళ్లకి పోటీగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఒక రోజులో ఆయన 3 సినిమాలకి పనిచేసేవారట. ఉదయం 7 నుండీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 2 గంటల నుండీ 7 గంటల వరకు వరకు, 9 గంటల నుండీ 2 గంటల వరకు ఈయన 3 షిఫ్ట్ ల ప్రకారం సినిమా షూటింగ్లలో పాల్గొనేవారట.
టాలీవుడ్లో ఆ టైములో కొత్త పంథాలో సినిమాలు చేస్తూ వచ్చింది కృష్ణగారే అని ఓ సందర్భంలో దివంగత స్టార్ డైరెక్టర్ దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు చెప్పుకొచ్చారు. ఆయనకు ఏ చిన్న హీరో అయినా నచ్చితే సూపర్ స్టార్ కృష్ణ గారిలా కష్టపడి ఎదగమని చెప్పేవారట. ఈ మాట ఎక్కువ సార్లు మోహన్ బాబుకి చెప్పినట్టు కూడా ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే కృష్ణ గారిని అంత ఇష్టపడే ఈ స్టార్ డైరెక్టర్..
ఆయనకు మాత్రం ఒక్క హిట్టు ఇవ్వలేకపోయాడట. దాసరి గారి దర్శకత్వంలో దాదాపు 7 సినిమాలు చేశారు కృష్ణ గారు. ‘రాధమ్మ పెళ్లి’ ‘ఊరంతా సంక్రాంతి’ ‘యుద్ధం’ ‘విశ్వనాథ నాయకుడు’ మొదలగు చిత్రాలు వీరి కాంబినేషన్లో రూపొందాయి. ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయాట. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి అప్పటి స్టార్ హీరోలందరికీ దాసరి నారాయణ రావు గారు హిట్స్ ఇచ్చారట.
కానీ కృష్ణగారు 7 సినిమాలకి అవకాశం ఇచ్చినా ఒక్క హిట్ కూడా ఇవ్వలేదని.. కొన్నాళ్ల తర్వాత ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రంలో ఆయనకు ఓ స్పెషల్ రోల్ ఇచ్చి అలా ఓ హిట్ ఇచ్చి సరిపెట్టారు అంటూ కృష్ణ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.