ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా తీశాం, ఆ సినిమా ఎంత ప్రేక్షకులకి నచ్చింది, నిర్మాతకు ఎంత లాభం తెచ్చిపెట్టింది అనే విషయాల కంటే ఎక్కువగా.. సినిమాని ఎంత భారీగా తీశాం అనే విషయం మీదే దర్శకులు దృష్టి సారిస్తున్నారు. మొన్నటికి మొన్న బోయపాటి శ్రీను తాను తెరకెక్కించిన “వినయ విధేయ రామ” అనే సినిమాలో ఒక పాట కోసం ఏకంగా 800 డ్యాన్సర్స్ ను పిలిపించాడు. సినిమాలో ఆ 800 మంది డ్యాన్సర్స్ ను ప్రేక్షకులు చూశారో లేదో తెలియదు కానీ.. నిర్మాతకు మాత్రం బాగానే ఖర్చయ్యింది. మరి బోయపాటి నుంచి స్పూర్తి పొందాడో లేక.. బోయపాటి రికార్డ్ ను బ్రేక్ చేయాలని కంకణం కట్టుకొన్నాడో తెలియదు కానీ.. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న “సైరా నరసింహా రెడ్డి”లో ఒక పాటను ఏకంగా 1000 మంది డ్యాన్సర్స్ తో పిక్చరైజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
ఆల్రెడీ రామోజీ ఫిలిమ్ సిటీలో ఈ కాస్ట్లీయస్ట్ సాంగ్ ను పిక్చరైజ్ చేయడం కోసం సెట్టింగ్ కూడా పూర్తయ్యింది. ఈ సాంగ్ లో ఒక్క నయనతార మినహా సైరా క్యాస్ట్ మొత్తం పాల్గొననున్నారు. ఇది ఇంట్రడక్షన్ లేదా ఎలివేషన్ సాంగ్ అని తెలుస్తోంది. మరి వెండితెర మీద అంతమంది డ్యాన్సర్స్ కనిపిస్తారో లేదో తెలియదు కానీ.. సురేందర్ రెడ్డి చేస్తోన్న ఈ ప్రయత్నం పుణ్యమా అని నిర్మాత చరణ్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. 2020లో విడుదలకానున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పటికప్పుడు లేట్ అవుతుండడంతో మెగా అభిమానులకు మాత్రమే కాక ఇండస్ట్రీ వర్గాలకు కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ పోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి సురేందర్ రెడ్డి స్పీడ్ పెంచుతాడో లేదో చూడాలి.