స్టార్ హీరోల సినిమాల్లోని పాత్రల పేర్లు, పాటలు, మాటలను యువ హీరోలు, దర్శకులు తమ సినిమాల టైటిల్స్ గా పెట్టడం కొత్త సంప్రదాయమేమీ కాదు. అయితే అగ్ర హీరోల సినిమాల విషయంలోను ఇదే జరగడం గమనించదగ్గదే. స్టార్ హీరో సూర్య సినిమా విషయంలో ఇప్పుడు జరిగిందదే. గతంలో “మాస్ ఎంగిర మాసిలామణి” సినిమా తెలుగు వెర్షన్ కి ‘రాక్షసుడు’ అని చిరు టైటిల్ తీసుకున్న సూర్య ఇప్పుడు రజనీ వాడుకుంటున్నారు.
హరి దర్శకత్వంలో ‘సింగం3’ సినిమా చేస్తున్న సూర్య తన తర్వాతి సినిమాని ‘నానుమ్ రౌడీదాన్’ ఫేమ్ విఘ్నేశ్ శివన్ తో చేయనున్న సంగతి తెల్సిందే. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి సూర్య 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమాకి ‘తానా సెర్నదా కూట్టమ్’ (ఈ సమూహం తమంతట తాముగా వచ్చినవారే అని అర్థం) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది రజనీ నటించిన సూపర్ హిట్ సినిమా ‘బాషా’ లోని డైలాగ్. దీనికి విక్రమ్ కుమార్ లాంటి దర్శకులు సహా తమిళనాట అంతటా విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల తమిళ యువ హీరో విక్రమ్ ప్రభు ‘కబాలి’ లోని ‘నెరుప్పుడా..’ని తన సినిమాకి టైటిల్ గా పెట్టిన సంగతి తెల్సిందే. విక్రమ్ ప్రభు మాట అటుంచితే.. సూర్య సినిమాకి తెలుగులో ఎలాంటి టైటిల్ పెడతారో మరి..?