మనకు ఓ పని ఎంత బాగా వచ్చినా.. తెలిసినవాళ్లు, మనవాళ్లు దగ్గర ఉంటే ఆ పని చేసేటప్పుడు కాస్త తడబడతాం. అప్పటివరకు బాగా చేసిన మనకు ఒక్కసారిగా ఆ పని కష్టమవుతోంది. ఎన్నో ఏళ్ల అలవాటు ఉన్న అదే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని మనకు తెలిసినవాళ్లే చూసి కాస్త నవ్వుకుంటారు కూడా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. అలాగే నవ్వుకున్నది ఎవరో కాదు ఆయన పెద్ద కుమార్తె సుస్మిత. ఎందుకంటే మనకు చెప్పింది కూడా ఆమెనే.
ప్రస్తుతం ‘మన శంకర్‌వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి, నయనతార మీద ఓ పాట చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసినట్లే అని చెబుతున్నారు. ఆ విషయం పక్కనపెడితే ఇటీవల సినిమా షూటింగ్‌లో హీరోయిన్‌తో కలసి చిరంజీవి డ్యాన్స్ వేస్తున్నారట. ఆ సమయంలో చిరంజీవి సతీమణి సురేఖ అక్కడకు వచ్చారట. దాంతో భలే సరదా సంఘటన ఒక్కటి అక్కడ జరిగిందట. అదే తడబాటు.
చిరంజీవి డాన్స్ గురించి, స్టెప్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు తెరపై మంచి డ్యాన్సర్లు అనే లిస్ట్ రాస్తే కచ్చితంగా టాప్‌లో ఆయన పేరే ఉండేది, ఉంది, ఉంటుంది కూడా. అలాంటి ఆయన స్టెప్పులేస్తున్నప్పుడు భార్యను చూసి తడబడ్డాడట. అప్పటి వరకు నాన్న బాగానే చేస్తూ వచ్చారు. సడెన్‌గా అమ్మ వచ్చి కూర్చునేసరికి స్టెప్ కాస్త అటు ఇటు అవ్వడం, డాన్స్ మరిచిపోవడం టకా టకా జరిగిపోయాయి అని సుస్మిత చెప్పారు. ఇదంతా తెలుసుకున్న ఫ్యాన్స్ ‘చిరు మనలాంటోడే’ అంటూ మురిసిపోతున్నారు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే తెలిపారు. అయితే ఇంకా సినిమా రిలీజ్ డేట్ చెప్పలేదు. ప్రస్తుతం వస్తున్న పుకార్ల ప్రకారం అయితే సినిమాను జనవరి 14న విడుదల చేస్తారని సమాచారం. త్వరలో సినిమా నుండి ఓ పాటను రిలీజ్ చేస్తారని సమాచారం.