ఎస్వీ కృష్ణా రెడ్డి.. ఈ పేరు చెబితే కళ్ల ముందు ఎన్నో క్లాసిక్ సినిమాలు, కిర్రాక్ కామెడీ సినిమాలు, వండర్‌ఫుల్ ఎమోషనల్ సినిమాలు గుర్తొస్తాయి. అగ్ర హీరోలతో సినిమాలు తీసి ఇబ్బందికర ఫలితాలు అందుకున్న ఆయన.. ఓ మోస్తరు స్టార్లతో సినిమాలతో రికార్డు బ్రేకింగ్ విజయాలు అందుకున్నారు. ఒకానొక సమయంలో ఆయన సినిమాలకు స్టార్ హీరోల స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చేవి అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఆయన హీరో కూడా అయిపోయారు. అయితే ఆ తర్వాత తర్వాత ఆయన ప్రభ తగ్గుతూ వచ్చింది.
2009 వరకు వరుస సినిమాలు తీసిన ఆయన ఆ తర్వాత రెండుసార్లు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ రెండూ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు మూడోసారి రీఎంట్రీకి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఓ సినిమాను స్టార్ట్ చేశారు కూడా. మామూలుగా అయితే ఇది నార్మాల్ వార్త. అయితే ఆయన రీ రీ రీ ఎంట్రీలో ట్విస్ట్ ఆయన చేస్తున్న సినిమాలో హీరోయిన్ ఇండియన్ కాదు. దక్షిణ కొరియాకు చెందిన జున్ హ్యూన్ జీ అనే నటి ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఎప్పటిలా ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం కూడా ఇస్తున్నారట. ఇక ఈ సినిమా పేరు చెబితే మీకు ఓ డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే సినిమా టైటిల్ ‘వేదవ్యాస్’. ఇది ఆయనక డ్రీమ్ ప్రాజెక్టు అట. ఇలాంటి పేరుతో దక్షిణ కొరియా నటిని ‘హీరో’యిన్‌గా చేయడం ఏంటి అనేదే అర్థం కావడం లేదు. ఇదంతా ఓకే కానీ ఈ రీ రీ రీ ఎంట్రీ ఏంటి అనుకుంటున్నారా?
2009లో ‘మస్త్’ అనే సినిమా చేశాక ఐదేళ్లు ఆగి ‘యమలీల 2’ చేశారు. ఇది రీఎంట్రీ. ఇక తొమ్మిదేళ్లు ఆగి 2023లో రీ రీ ఎంట్రీ ఇస్తూ ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమా చేశారు. ఆ లెక్కన ‘వేదవ్యాస్’ రీ రీ రీ ఎంట్రీనే కదా.