మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 తర్వాత చేస్తున్న “సైరా నరసింహారెడ్డి” తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను డైరక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం ప్రారంభమయింది. ఈ షెడ్యూల్లో నయనతార, అమితాబ్ బచ్చన్, చిరంజీవిలపై ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ తప్పుకున్న తర్వాత సంగీత దర్శకునిగా ఇళయరాజాని సంప్రదించారు. అలాగే కీరవాణిని తీసుకోవాలని అనుకున్నారు. చివరికి ఆ అవకాశం బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది కి వెళ్ళింది. ఇతను గతంలో ‘దేవ్ డి, ఇష్క్ జ్యాదా, క్వీన్, హైవే, లూటేరా’ వంటి సినిమాలకు సంగీతం ఇచ్చారు. అలాగే ప్రభాస్ 20 వ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఆ చిత్రం కంటే ముందే అమిత్ త్రివేది సైరా కోసం స్వరాలను సమకూర్చనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.