Tamil Film Producers Council: కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు నిలిపివేత.. నిర్మాతల మండలి నిర్ణయం.!

  • July 30, 2024 / 02:20 PM IST

కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత తెలుగు సినిమా నిర్మాతల మండలి సినిమాల్ని ఆపేసి, ఆ తర్వాత వరుస మీటింగ్‌లు పెట్టి భారీ నిర్ణయాలు తీసుకుంది గుర్తుందా? అవి ఇప్పుడు పాటిస్తున్నారా? లేదా? అనేది పక్కనపెడితే.. ఇప్పుడు అలాంటి నిర్ణయాలు, ఓ హీరో విషయంలో షాకింగ్‌ నిర్ణయాలను తమిళ సినీ నిర్మాతల మండలి తీసుకుంది. ఈ మేరకు తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షతన తమిళనాడు సినిమా థియేటర్ల యజమానుల సంఘం, సినిమా మల్టీఫ్లెక్స్‌ యజమానుల సంఘం, రాష్ట్ర సినిమా పంపిణీదారుల సంఘం సమావేశం ఇటీవల చెన్నైలో జరిగింది.

ఈ సమావేశంలో కీలకమైన ఆరు తీర్మానాలు చేశారు. పెద్ద హీరోల సినిమాలు, పెద్ద సినిమాలు విడుదలైన ఎనిమిది వారాలు తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఓ సినిమాకు అడ్వాన్స్‌ తీసుకున్నప్పుడు ముందుగా ఆ సినిమా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాతే ఇతర సినిమాల్లో నటించాలని సూచించారు. ఇక ఇప్పటికే చాలామంది నిర్మాతల దగ్గర అడ్వాన్స్‌ తీసుకున్న ధనుష్‌ (Dhanush) విషయంలో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు.

ఇకపై ధనుష్‌తో సినిమాలు చేసే నిర్మాతలు ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ముందు నిర్మాతల సంఘంతో చర్చించాలని సమావేశంలో తీర్మానం చేశారు. సినిమాల విడుదలకు సరిగ్గా థియేటర్లు లభించని ఈ పరిస్థితుల్లో.. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాతే చిత్రీకరణలు ప్రారంభించాలని మీటింగ్‌లో తీర్మానించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 16 నుండి కొత్త సినిమాల ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న సినిమాల షూటింగ్‌ అక్టోబరు 30లోపు పూర్తి చేయాలని కోరారు.

నటులు, సాంకేతిక నిపుణుల వేతనాలు, ఖర్చుల నియంత్రణ గురించి కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నవంబరు 1 నుండి సినిమాల చిత్రీకరణల పనులను నిలిపివేయాలని తీర్మానం చేశారు. నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు కలసి ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసినట్లు నిర్మాతల మండలి తెలిపింది. భవిష్యత్తులో సినీరంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ పని చేస్తుందని తెలిపింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus