క్యాస్టింగ్ కౌచ్ గురించి గత కొన్నాళ్లుగా హీరోయిన్స్ తమ అభిప్రాయాన్ని దైర్యంగా మీడియాతో పంచుకుంటున్నారు. కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ అన్ని పరిశ్రమలో సహజం అంటుంటే.. మరికొంతమంది లైంగిక ఒత్తిడి జరిగిన వెంటనే బయటికి చెప్పాలని.. అప్పుడే ఆ సమస్యని తగ్గించవచ్చని సూచిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. తాజాగా ‘వీరభద్ర’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన తనుశ్రీ దత్తా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ‘‘హాలీవుడ్‌లో మీటూ హ్యాష్ ట్యాగ్ ఉద్యమం రెండేళ్ల క్రితం మొదలైంది. కానీ దాన్ని నేను ఎన్నో ఏళ్ల క్రితమే ప్రారంభించా. ‘హార్న్ ఓకే ప్లీజ్’ అనే హిందీ చిత్రంలో నేనొక్కదాన్నే డ్యాన్స్ వేయాల్సిన పాట ఉంది. ఆ పాట షూటింగ్ సమయంలో ఓ నటుడు నా చెయ్యి పట్టుకుని లాగాడు. ఎవరెంత వారించినా వినలేదు.
ఈ విషయం నేనప్పుడే మీడియాకు వెల్లడించా. మూడు రోజుల పాటు ఈ వార్త టీవీలో ప్రసారమైంది. ఈ సంఘటనతో నా సినిమా అవకాశాలన్నీ పోయాయి’’ అంటూ తనుశ్రీ వెల్లడించింది. “ఇప్పుడు ఆ క్యాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు.. నేను అలా బయటపెట్టడం వల్ల నా కెరీర్ దెబ్బ తింది. నాలాగా ఎవరూ అవకాశాలు పోకుండా చూసే వారు ఉన్నారా?” అంటూ పరిశ్రమ పెద్దల్ని నేరుగా ప్రశ్నించింది. ఈ విషయంలో మీడియా కూడా ప్రేక్షకుడి పాత్రనే పోషిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటలు ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.