Tatva Review in Telugu: తత్వ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 10, 2024 / 10:24 PM IST

Cast & Crew

  • హిమ దాసరి (Hero)
  • పూజా రెడ్డి బోరా (Heroine)
  • ఒస్మాన్ ఘని తదితరులు. (Cast)
  • రుత్విక్ యాలగిరి (Director)
  • మానస దాసరి (Producer)
  • సాయితేజ (Music)
  • సి.హెచ్.సాయి (Cinematography)

ఒక్కోసారి యువ బృందం చేసే ప్రయత్నం భలే అలరిస్తుంటుంది. అలాంటి ఒక ఇండిపెండెంట్ సినిమానే “తత్వ” (Tatva). ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ 58 నిమిషాల సినిమా కొత్త కాన్సెప్ట్ & క్వాలిటీ టేకింగ్ తో అలరిస్తుంది. అసలు “తత్వ” అంటే ఏమిటి? ఎలా ఉంది? అనేది చూద్దాం..!!

Tatva Review in Telugu

కథ: ఆరిఫ్ (హిమ దాసరి) ఓ సాదాసీదా ట్యాక్సీ డ్రైవర్. థామస్ (ఒస్మాన్ ఘని) అనే బిజినెస్ మ్యాన్ హత్య కేసులో అనుకోని విధంగా ఇరుక్కుంటాడు ఆరిఫ్. మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ కేసును డీల్ చేయడానికి రంగంలోకి దిగుతుంది సిస్నియర్ పోలీస్ ఆఫీసర్ మరియు రెండ్రోజుల్లో డీసీపీ కోడలు కాబోతున్న జ్యోత్స్న (పూజా రెడ్డి బోరా). కట్ చేస్తే.. తనతో ఇదంతా చేయించింది దేవుడు అని చెబుతాడు ఆరిఫ్.

అసలు ఆరిఫ్ & థామస్ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి? థామస్ హత్య కేసులో ఆరిఫ్ ఎలా ఇరికించబడతాడు? జ్యోత్స్న ఈ కేస్ ను డీల్ చేసి ఆరిఫ్ ను నిర్దోషి అని ప్రూవ్ చేసిందా లేక శిక్ష పడేలా చేసిందా? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “తత్వ” (Tatva) చిత్రం.

నటీనటుల పనితీరు: సినిమాకి మెయిన్ హీరో హిమ దాసరి అయినప్పటికీ.. నటుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్న వ్యక్తి మాత్రం ఒస్మాన్ ఘని. థామస్ పాత్రకు ప్రాణం పోశాడు. అలాగే.. మరో వేరియేషన్ లోనూ నవ్విస్తూనే ఆలోచింపజేసే, చివరికి ఎమోషనల్ చేశాడు. ఆరిఫ్ అనే పాత్రలో హిమ దాసరి కూడా అలరించాడు. ఓ సగటు యువకుడిగా అతడి నటనలో అసహజత్వం ఎక్కడా కనిపించలేదు.

మూడో కీలకపాత్ర పోషించిన పూజా రెడ్డి బోరా మొదట్లో రెగ్యులర్ రోల్ అనిపించినా.. చివర్లో ఆశ్చర్యపరిచింది. ఆమె పాత్ర ద్వారా కథ తిరిగి మలుపు బాగుంది.

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు సాయితేజ పనితనాన్ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే.. సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక్కో క్యారెక్టర్ ను, ఒక్కో సందర్భాన్ని అర్థం చేసుకొని సందర్భానుసారంగా అందించిన నేపథ్య సంగీతం స్టోరీ థీమ్ ని బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ సి.హెచ్.సాయి కెమెరా వర్క్ కొన్ని ఫ్రేమ్స్ లో ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో తెలియదు కానీ.. లైటింగ్ & డి.ఐ టాప్ క్లాస్ లో ఉన్నాయి. దర్శకుడు రుత్విక్ గురించి మాట్లాడుకుంటే.. ఒక సింపుల్ కాన్సెప్ట్ ను వీలైనంత కొత్తగా ఎగ్జిక్యూట్ చేశాడు.

“రన్ రాజా రన్, సాహో” చిత్రాలకు సుజీత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన రుత్విక్ తనదైన శైలిలో థ్రిల్లింగ్ గా కథను నడిపిన విధానం బాగుంది. అయితే.. కథనం కాస్త 2019లో వచ్చిన “గేమ్” సినిమాను గుర్తు చేయడం గమనార్హం. అయితే.. మనిషిలో మానవత్వం అంతరిచిపోతున్నదనే విషయాన్ని వివరించిన విధానం బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాను అనవసరంగా సాగదీయకుండా 58 నిమిషాల్లోనే ముగించడం ప్రశంసార్హమైన విషయం. అయితే.. కొన్ని లాజిక్స్ ను సింపుల్ గా తేల్చేసాడు దర్శకుడు. ఆ విషయాలను కూడా కాస్త వివరంగా వివరించి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడిగా, రచయితగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు రుత్విక్.

విశ్లేషణ: కొన్ని కాన్సెప్ట్స్ క్రిస్ప్ గానే బాగుంటాయి. అనవసరంగా పాటలు, ఫైట్లు యాడ్ చేసి రెండున్నర గంటల సినిమాలుగా తీయడం వల్ల మంచి కాన్సెప్ట్ కూడా బోర్ కొట్టిస్తాయి. అలాంటి గోల లేకుండా సింపుల్ గా 58 నిమిషాల పాటు అలరించే మంచి థ్రిల్లర్ “తత్వ”. సినిమాటోగ్రఫీ వర్క్ & నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణలుగా తెరకెక్కిన ఈ చిన్న సినిమాను (లెంగ్త్ వైజ్ మాత్రమే) ఈటీవీ విన్ యాప్ లో చూసేయండి.

ఫోకస్ పాయింట్: డీసెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్ చేసిన “తత్వ”.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags