ఇటీవల ‘మిరాయ్’ అంటూ వచ్చి ప్రేక్షకుల్ని అలరించి, సూపర్ మ్యాన్ అనే తన ట్యాగ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు తేజ సజ్జా. స్టార్ హీరో ఇమేజ్ లేకపోయినా, ఆ స్థాయి లుక్స్ – అప్పీయరెన్స్ లేకపోయినా కథ, భారీతనంతో రాణిస్తున్నాడు. ఆ సినిమాకు ముందు ‘హను – మాన్’ అనే సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. దీంతో తేజ తర్వాత చేయబోయే సినిమా ఏంటి అనే చర్చ మొదలైంది. దీనికి డబుల్ మూవీస్ అనే ఆన్సర్ ఇప్పుడు వినిపిస్తోంది.
అవును, తేజ సజ్జా త్వరలో రెండు సినిమాలను ఒకేసారి స్టార్ట్ చేయబోతున్నాడట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ రెండు సినిమా సీక్వెల్సే అని చెబుతున్నారు. తేజ హీరో అయ్యాక చేసిన సినిమాలు చాలావరకు మంచి పేరే తీసుకొచ్చాయి. వాటిలో ‘హను – మాన్’, ‘మిరాయ్’, ‘జాంబి రెడ్డి’ ఉన్నాయి. ఈ మూడు సినిమాలకు సీక్వెల్స్ వస్తాయని ఆ సినిమాల రిలీజ్ సమయంలోనే చెప్పేశారు. అందులో రెండు సినిమాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తారట.
‘జాంబి రెడ్డి’ సీక్వెల్‌ను ఇటీవల అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ చేస్తారట. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కాకుండా అతని దర్శకత్వ విభాగంలోని మరో వ్యక్తి డైరెక్ట్ చేస్తారట. కథ విషయంలో ప్రశాంత్ వర్మ చూసుకుంటారట. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు ‘మిరాయ్ 2’ సినిమా పనులు షురూ చేస్తారట. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈ పనులను ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండు చిత్రాల్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది.
ఒక నిర్మాణ సంస్థ ఒకే హీరోవి రెండు సినిమాలు సెట్స్‌మీదకు రావడం, రెండూ షూటింగ్ జరుపుకోవడం చాలా అరుదు. ఇప్పుడు తేజ సజ్జా అదే పని చేయబోతున్నాడు. మరి నిజంగానే రెండు మొదలవుతాయా లేదా అనేది చూడాలి. అన్నట్లు ‘జై హనుమాన్’లో కూడా తేజ ఉంటాడని టాక్. అదే జరిగితే మూడు సీక్వెల్స్‌లో ఒకేసారి సెట్స్‌మీద ఉంటాయి.