తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి అనూహ్యంగా మృతి చెందారనే వార్త టాలీవుడ్ వర్గాలను షాక్‌కి గురిచేసింది. దుబాయ్‌లో మంగళవారం ఆయన మరణించినట్లు సమాచారం. కానీ, ఆయన మరణానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదు. ఈ వార్తను విన్న సినీ ప్రముఖులు, ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. కేదార్ సెలగంశెట్టి సినీ రంగంలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునేలా ప్రయత్నం చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun), బన్నీ వాసు (Bunny Vasu) ప్రోత్సాహంతో కేదార్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మొదట కేవలం వ్యాపార రంగంలో ఉన్న కేదార్, సినిమాలపై ఉన్న ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి వచ్చారు. ఆయన తొలి ప్రయత్నంగా కో ప్రొడ్యూసర్‌గా ‘ముత్తయ్య’ అనే సినిమాకు పనిచేశారు. అనంతరం ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా (Gam Gam Ganesha) సినిమాను స్వయంగా నిర్మించి, తనలోని నిర్మాతను బయటకు తీసుకువచ్చారు.
ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా, కేదార్‌కి సినిమాలపైనున్న అభిమానం తగ్గలేదు. అలాగే గతంలో విజయ్ దేవరకొండతో ఓ భారీ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన ముందడుగు కూడా కేదార్ వేసి, సుకుమార్‌కు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఇలాంటి సమయంలో ఆయన మరణించడం అందరికీ షాక్ కలిగించే వార్తగా మారింది. అయితే కేదార్ దుబాయ్ ఎందుకు వెళ్లారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అక్కడ ఓ నిర్మాత కొడుకు పెళ్లి కోసం వెళ్లారా? లేక ఇటీవల జరిగిన భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారా? అన్నది తెలియాల్సి ఉంది. కానీ, ఈ అనూహ్య మరణం సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. కేదార్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కేదార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.