సిద్ధార్థ్ ( Siddharth), మాధవన్ (R.Madhavan), నయనతార (Nayanthara) ప్రధాన పాత్రధారులుగా శశికాంత్ (S. Sashikanth) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “టెస్ట్” (Test). 2023లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిజానికి 2024లో థియేటర్లలో విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ.. కారణాంతరాల వలన డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ థ్రిల్లింగ్ డ్రామా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!
కథ: శరవణన్ (మాధవన్) ఓ సైంటిస్ట్. పెట్రోల్/డిజిల్ కి ప్రత్యామ్నాయమైన ఫ్యూయల్ ను కనిపెట్టాలనేది అతడి ధ్యేయం. అందుకు 5 కోట్ల రూపాయల లంచం ఇవ్వాల్సి వస్తుంది. కుముద (నయనతార) పిల్లల కోసం ప్రయత్నిస్తూ.. ఆఖరి ఆప్షన్ గా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటుంది. అందుకోసం 5 లక్షలు అవసరమవుతాయి. అర్జున్ వెంకటరామన్ (సిద్ధార్థ్) రిటైర్మెంట్ ఏజ్ కి చేరుకున్న ఓ సీనియర్ & సిన్సియర్ క్రికెటర్. ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో ఎలాగైనా అతడి సత్తా చాటాలనుకుంటాడు.
ఈ ముగ్గురు అనుకోని విధంగా ఓ సందర్భంలో కలుసుకుంటారు. ఆ తర్వాత వారి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. అసలు వీళ్ల ముగ్గురికీ ఉన్న సంబంధం ఏమిటి? ఒకరి జీవితాలను మరొకరు ఇలా ఇంపాక్ట్ చేసారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “టెస్ట్” (Test) చిత్రం.
నటీనటుల పనితీరు: మాధవన్ ఈ సినిమాలో అందర్నీ డామినేట్ చేశాడని చెప్పాలి. అతడి పాత్రకి ఉన్న వేరియేషన్స్ ను తనదైన శైలిలో అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ లో నెగిటివ్ షెడ్ ను పండించిన విధానం ప్రశంసనీయం.
అలాగే.. నయనతార కూడా రెండు వైవిధ్యమైన ఎమోషన్స్ ను పండించిన విధానం అలరిస్తుంది. సిద్ధార్థ్ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేశాడు. ధ్యేయానికి, సెంటిమెంట్ కి మధ్య కొట్టుమిట్టాడే పాత్రలో సిద్ధార్థ్ నటన కథ గమనానికి కీలకంగా మారింది. వినయ్ వర్మ (Vinay Varma), మీరా జాస్మిన్ (Meera Jasmine), ఆడుకాలం మురుగదాస్ (Aadukalam Murugadoss) తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: విరాజ్ సింగ్ (Viraj Sinh Gohil) సినిమాటోగ్రఫీ వర్క్, సురేష్ ఎడిటింగ్ వర్క్ బాగున్నాయి. శక్తిశ్రీ గోపాలన్ (Shakthisree Gopalan) ఈ సినిమాతో సంగీత దర్శకురాలిగా మారింది. సిద్ధార్థ్-మాధవన్ మధ్య వచ్చే సన్నివేశంలో వారి ఇద్దరి నడుమ జనరేట్ అయ్యే ఈగోని నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేసిన విధానం బాగుంది. అలాగే.. క్లైమాక్స్ లో మూడు డిఫరెంట్ ఎమోషన్స్ ను ఎలివేట్ చేసిన తీరు కథను ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించింది.
దర్శకుడు శశికాంత్ ఇంత భారీ క్యాస్టింగ్ & బిగ్గెస్ట్ కాన్వాస్ తో స్లో పేస్ డ్రామా ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని నడిపించాలనుకోవడం చిన్నపాటి అత్యాశ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇంతమంచి క్యాస్టింగ్ ఉన్నప్పుడు.. కోర్ పాయింట్ తోపాటు, డ్రామాలో వేగం మరియు ఆసక్తి కూడా సమానంగా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు సినిమాను ఫార్వర్డ్ చేయకుండా చూస్తారు. ఈ ఓటీటీ కాలంలో ప్రేక్షకుడిని కదలనివ్వకుండా చేయాలి అంటే స్లో పేస్ డ్రామా అనేది సరైన ఎంపిక కాదు, ఒకవేళ స్లే పేస్ డ్రామా ఉన్నప్పటికీ.. అందులో మంచి ఎమోషన్ కూడా ఉండాలి. ఈ రెండూ లేకుండా కథను నడిపించడం అనేది “టెస్ట్” సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది. సో, దర్శకుడు శశికాంత్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యాడనే చెప్పాలి.
విశ్లేషణ: ఈస్థాయి క్యాస్టింగ్ ఉన్నప్పుడు అందరూ మంచి గ్రిప్పింగ్ డ్రామా ఆశిస్తారు. “టెస్ట్” (Test) సినిమాకి అదే పెద్ద మైనస్ గా మారింది. నయనతార, సిద్ధార్థ్, మాధవన్, మీరా జాస్మిన్ వంటి ఆర్టిస్టులు ఉన్న ఈ చిత్రంలో కోర్ పాయింట్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నప్పటికీ.. ఎమోషన్ సరిగా పండకపోవడంతో రెండున్నర గంటల ఈ చిత్రం (Test) ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది.
ఫోకస్ పాయింట్: ప్రేక్షకుల సహనానికి పరీక్ష!
రేటింగ్: 2/5