తమిళ స్టార్ హీరో అజిత్ కు ప్రమాదం జరిగింది. ‘వలిమై’ అనే సినిమా షూటింగ్ లో భాగంగా బైక్ స్టంట్ చేస్తుండగా.. ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అజిత్ చేతికి, కాళ్లకి గాయాలు కావడంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు. హైదరాబాద్ లోనే ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ స్టంట్ సీన్స్ కోసం అజిత్ తన సొంత బైక్ ని ప్రత్యేకంగా తెప్పించుకున్నారట. సదరు సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా బైక్ స్కిడ్ అవ్వడంతో ప్రమాదం జరిగింది. గతంలో అజిత్ నటించిన ‘నెర్కొండ పారవై’ సినిమాను రూపొందించిన దర్శకుడు హెచ్ వినోద్ ఇప్పుడు మరోసారి ‘వాలిమై’ కథతో అజిత్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం కొన్ని రిస్కీ స్టంట్లు చేస్తున్నారు అజిత్. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బైక్ ఫ్రంట్ వీల్ గాల్లోకి లేపి సింగిల్ వీల్ మీద డ్రైవ్ చేయడం లాంటి విన్యాసాలు చేస్తున్నారట. అజిత్ కి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. రేస్ ట్రాక్ లపై ఆయన పోటీ కూడా చేశారు. రేసర్ గా ఆయనకి అంతర్జాతీయ గుర్తింపు ఉంది.
అందుకే ఈ సినిమాలో బైక్ రైడింగ్ షాట్లను సొంతంగా చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు దెబ్బలు తగలడంతో డూప్ తో కానిచ్చేస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అజిత్ సరసన హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.