విజయ్ సేతుపతి, నిత్యామీనన్ కాంబినేషన్ లో పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “తలైవన్ తలైవి”. ఈ చిత్రాన్ని తెలుగులో “సార్ మేడం” అనే టైటిల్ తో రిలీజ్ చేసేందుకు సన్నద్ధమై ఆఖరి నిమిషంలో పోస్ట్ పోన్ చేశారు. ట్రైలర్ అయితే విశేషంగా ఆకట్టుకోగా.. విడుదలైన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ:
ఆగాసవీరన్ (విజయ్ సేతుపతి) సొంతంగా కుటుంబంతో కలిసి ఒక హోటల్ నడుపుతుంటాడు. అతడు తయారు చేసే పరోటాలకి మంచి గిరాకీ. ఆ పరోటాలు నచ్చే పెళ్లికి ఒప్పుకుంటుంది అరసు (నిత్యామీనన్). భార్య మీద విపరీతమైన ప్రేమ, తల్లి మీద విశేషమైన గౌరవం ఉన్న ఆగాసవీరన్ ఎప్పటికప్పుడు అత్తాకోడళ్ల నడుమ నలుగుతూనే ఉంటాడు.
ఒకానొక సందర్భంలో అరసు అన్నయ్య వచ్చి ఆగాసవీరన్ కుటుంబాన్ని కొట్టి మరీ ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోతాడు. దాంతో మొగుడుపెళ్లాలు ఏకంగా 3 నెలలపాటు ఒకర్ని ఒకరు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా గడిపేస్తారు.
మూడు నెలల తర్వాత వాళ్ల పాపకి గుండు కొట్టించే వేడుకలో కలిసిన మొగుడు పెళ్ళాల మధ్య ఎం సంభాషణ జరిగింది? చివరికి వాళ్లు కలిశారా? లేదా? అనేది “తలైవన్ తలైవి” కథాంశం.
నటీనటుల పనితీరు:
నిత్యామీనన్ & విజయ్ సేతుపతి కెరీర్లో ఇదే లౌడెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఓ సగటు కుటుంబంలో, అందులోనూ దిగువ మధ్యతరగతి కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఎలా ఉంటారో అచ్చు అలానే ఒదిగిపోయారు ఇద్దరూ. ఒకరి నటనను మరొకరు కాంప్లిమెంట్ చేసుకున్న విధానం బాగుంది. విపరీతమైన ప్రేమ అనేది చాలా తక్కువసార్లు చూస్తూ ఉంటాం. ఈ చిత్రంలో ఆ ఎమోషన్ ను నిత్యామీనన్ & విజయ్ సేతుపతి చాలా చక్కగా, సహజంగా పండించారు.
దీపా శంకర్ అత్తగారిగా మంచి నటనతో ఆకట్టుకుంది. అలాగే.. చెంబన్ వినోద్ జోస్ & ఆర్.కె.సురేష్ ల నటన సినిమాకి మంచి వెల్యూ యాడ్ చేసింది.
సినిమాతో సంబంధం లేకపోయినా.. యోగిబాబు సన్నివేశాలు మంచి హాస్యాన్ని పండించాయి.
సాంకేతికవర్గం పనితీరు:
సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం, పాటలు భలే కొత్తగా ఉన్నాయి. వాటిని తెరకెక్కించిన విధానం కూడా బాగుంది. ఈ పాటల్లో యానిమేటెడ్ క్యారికేచర్స్ ను వాడిన విధానం కూడా బాగుంది.
సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ చాలా రియలిస్టిక్ గా సినిమాని చూపించడంలో సక్సెస్ అయ్యాయి.
దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమా కథను బాలీవుడ్ చిత్రం “పటాకా” (2018) నుండి స్ఫూర్తి పొందినట్లుగా అర్థమవుతుంది. ఇద్దరు వ్యక్తులు అది అక్కాచెల్లెళ్లు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు.. వారి మధ్య ప్రేమ అనేది వాళ్ల మధ్య వచ్చే గొడవల్లోనే కనిపిస్తుంది. “తలైవన్ తలైవి” కాన్సెప్ట్ కూడా అదే. ప్రేముంటేనే కొట్టుకుంటారు అనేది కోర్ పాయింట్ గా అల్లుకున్న కథాంశం ఇది. క్యారెక్టరైజేషన్ ద్వారా కామెడీ పండించడం అనేది ప్లస్ అయ్యింది. అలాగే.. ఆడియన్స్ ను హోల్డ్ చేయడంలోనూ సక్సెస్ అయ్యాడు పాండిరాజ్. ముఖ్యంగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కథనాన్ని నడిపించిన విధానం బాగుంది. అలాగే కొన్ని కీపాయింట్స్ ను రివీల్ చేయకుండా మ్యానేజ్ చేసిన విధానం కూడా బాగుంది. అన్నిటికీ మించి లెక్కకు మిక్కిలి పాత్రలతో ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా మంచి హాస్యాన్ని, ఎమోషన్ ను పండించిన విధానం మరో హైలైట్. ఓవరాల్ గా దర్శకుడు పాండిరాజ్ ప్రేక్షకుల్ని రెండున్నర గంటలపాటు అలరించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
విశ్లేషణ:
సినిమాలో కీ ఆర్టిస్టులు కాస్త అరిచినట్లుగా మాట్లాడుకునే విధానం కొంతమంది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.. అలాగే కోర్ పాయింట్ ఏమిటి? కాన్ ఫ్లిక్ట్ ఏమిటి? అనేది రివీల్ చేయడానికి మరీ ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ చిన్నపాటి మైనస్ ను పక్కన పెడితే.. “తలైవన్ తలైవి” కుటుంబం మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేయదగిన సినిమా. అలాగే.. ఈమధ్యకాలంలో బ్రేకప్ లు, మల్టిపుల్ రిలేషన్ షిప్స్ చాలా కామన్ అయిపోతున్న ఈ తరుణంలో.. ఒక బంధాన్ని ఎంత గట్టిగా ఒడిసిపట్టుకుంటే అంత మంచిది అనే మెసేజ్ ను నిర్లిప్తంగా ఇచ్చిన విధానం కూడా బాగుంది. మంచి డ్రామా, అంతకుమించిన హాస్యం కోసం ఈ చిత్రాన్ని హ్యాపీగా చూసేయండి.
ఫోకస్ పాయింట్: జెన్ జీకి రిలేషన్ షిప్ వేల్యూ తెలియజెప్పే చిత్రం!
రేటింగ్: 3/5