ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మాస్టర్’ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమాకి మంచి ఫలితమే దక్కింది. ముందు నుండి సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. కోలీవుడ్ లోనే కాకుండా.. తెలుగులో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. కార్తీతో ‘ఖైదీ’ లాంటి సినిమా తీసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమా రిజల్ట్ కి సంబంధించి లోకేష్ పై చాలా మంది విమర్శలు చేశారు.
దర్శకుడిగా తన మార్క్ చూపించలేకపోయాడంటూ కామెంట్స్ చేశారు. ఈ విమర్శలతో సంబంధం లేకుండా హీరో విజయ్ ఇప్పుడు మరోసారి అతడితో కలిసి పని చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ‘మాస్టర్’ సినిమా తరువాత విజయ్.. నెల్సన్ దిలీప్ కుమార్ అనే మరో యువ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఈ బ్యానర్ లో మురుగదాస్ తో సినిమా చేయాలి కానీ స్క్రిప్ట్ నచ్చక మురుగదాస్ ని తప్పించారు.
ఆ స్థానంలోకి దిలీప్ కుమార్ వచ్చాడు. ఈ సినిమా తరువాత విజయ్ తో పని చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు కానీ విజయ్ మాత్రం లోకేష్ కనగరాజ్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నాడట. నిజానికి విజయ్ కి ఓ దర్శకుడు నచ్చితే అతడితో వరుసగా సినిమాలు చేస్తుంటాడు. గతంలో మురుగదాస్, అట్లీ వంటి దర్శకులతో రెండు, మూడు సినిమాలు అలానే చేశాడు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కి కూడా అలాంటి ఛాన్సే ఇచ్చాడు. మరి ఈసారైనా లోకేష్ బ్లాక్ బస్టర్ కథ రాసుకుంటాడేమో చూడాలి!