తమన్ కేవలం సినిమాలకు సంగీతం ఇవ్వడం మాత్రమే కాకుండా.. సినిమా పరిశ్రమ తీరును తూర్పారపడుతుంటారు కూడా. పరిశ్రమ పరిస్థితుల గురించి తనదైన శైలిలో విమర్శిస్తుంటారు కూడా. ఆయన మాటలు కాస్త కఠువుగానే ఉన్నా.. టాలీవుడ్ పరిస్థితిని కళ్లకు కట్టేలా ఉంటాయి. గతంలో ఒకట్రెండుసార్లు ఇలా తీవ్ర విమర్శలు చేసి.. ఇండస్ట్రీ కలర్‌ను బయట పెట్టిన తమన్.. ఇప్పుడు మరోసారి అలాంటి కామెంట్సే చేశారు. అయితే ఈసారి ప్రశంసలతోపాటు.. కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. తొలుత తమన్ ఏమన్నారో చూసి.. ఆ తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూద్దాం.
తెలుగు సినీ ఇండస్ట్రీకి దిష్టి తగిలింది. యూట్యూబ్, సోషల్‌మీడియా ఎక్కడ చూసినా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఈ సినిమా వారం ఆలస్యంగా రిలీజ్ అయింది. వాళ్లు (ఎరోస్) అనుకుని ఉంటే ముందే కేసు వేయవచ్చు. చివరి నిమిషంలో కేసు వేసి సినిమా ఆగిపోయేలా చేశారు. దీని బట్టే మనం తెలుసుకోవచ్చు. మన మధ్య ఐక్యత లేకుండా పోతోంది. మనం అనుకుంటే అందరం కలసి ముందుకు వెళ్తాం. కానీ కొంతమంది వివిధ స్టూడియోలకు వెళ్లి సలహాలు ఇచ్చారు. నిర్మాతల దగ్గరకు వచ్చి.. ఆ భరోసా ఇచ్చి ఉంటే బాగుండేది.

ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండ్ ఎయిడ్ వేయండి. దాని గురించి బయటకు వెళ్లి బ్యాండ్ వేయకండి అని సలహా ఇచ్చారు తమన్. సినిమా వాయిదా పడటం వల్ల నిర్మాతలు ఎంత కుమిలిపోయి ఉంటారు చెప్పండి. వాళ్లకూ కుటుంబం, పిల్లలు ఉంటారు కదా అని తమన్ అన్నారు. తమన్ చెప్పిన ‘ఐక్యత’ అనే మాట కరెక్టే. ఇది ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్లుగా లేదు. ఈ విషయాన్ని చాలామంది టాలీవుడ్ జనాలు చెప్పారు కూడా. అయితే ఆయన వదిలేసిన విషయం లేదా పట్టించుకోని విషయం ఏంటంటే.. ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాను ఇబ్బంది పెట్టింది టాలీవుడ్ జనాలు కాదు.
గతంలో 14 రీల్స్‌తో కలసి సినిమాలు చేసిన ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్. అలాగే ఈ సమస్య ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న కేసు. ఇన్నాళ్లూ పట్టించుకోని నిర్మాతలు.. వాళ్లు కోర్టుకు వెళ్లేసరికి రియాక్ట్ అయ్యారు. నవంబర్ 30న ఎరోస్ పిటిషన్‌ను మద్రాసు కోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాతనే వాళ్లు ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లారు. అంటే ఇదేదో లాస్ట్ మినిట్ వ్యవహారం కాదు. ఇవన్నీ తమన్‌కి తెలియనవి కావు. కానీ ఎందుకో అలా మాట్లాడారు మరి. అందుకే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. తొలుతే ఈ విషయం తేల్చుకోక నిర్మాతలు చేసిన స్వయం కృతాపరాధం అని చెప్పొచ్చు.
