తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తెలుగులో తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతమందించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్. తెలుగు సంగీత ప్రియులను కొత్త స్వరాలతో అలరించారు. సినిమా రిలీజ్ కానంతవరకు అనిరుధ్ పై అభినందనలు కురిపించారు. అందుకే త్రివిక్రమ్ అజ్ఞాతవాసి తర్వాత ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాకి కూడా అతన్నే తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అయితే అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ కాగానే.. సీన్ మొత్తం రివర్స్ అయింది. అందులో హీరోయిన్ గా నటించిన అను ఇమ్యానుయేల్ కి అవకాశాలు చేయి జారినట్టు.. అనిరుధ్ మీద కూడా బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. సెంటిమెంట్ పరంగా త్రివిక్రమ్, అనిరుధ్ జోడీ సెట్ కాదని తేల్చేశారు.
దీంతో అనిరుధ్ ని తొలగించి చర్చలు మొదలు పెట్టారు. మొదట దేవీశ్రీ ప్రసాద్ పేరు వినిపించినా.. అతనికి త్రివిక్రమ్ కి పడక పోవడంతో తీసుకోలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ థమన్ పేరు సూచించేసరికి అందరూ ఒకే అన్నారు. ఈ మధ్య థమన్ మూసధోరణిలో కాకుండా కొత్త కొత్త ట్యూన్స్ ఇస్తుండడంతో అతన్ని సంగీత దర్శకుడిగా సెలక్ట్ చేశారు. ఈ విషయాన్నీ అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్లనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.