The Bads of Bollywood Review In Telugu: ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • లక్ష్య (Hero)
  • షహీర్ బంబా (Heroine)
  • అన్య సింగ్, బాబీ డియోల్, రాఘవ్ జుయాల్, మోనా సింగ్, మనీష్ చౌదరి, మనోజ్ పహ్వా, రజత్ బేడీ (Cast)
  • ఆర్యన్ ఖాన్ (Director)
  • గౌరీ ఖాన్ (Producer)
  • ఉజ్వల్ గుప్తా - అనిరుధ్ రవిచందర్ - శాశ్వత్ సచ్ దేవ్ (Music)
  • జై ఓజా (Cinematography)
  • నితిన్ బెయిడ్ (Editor)
  • Release Date : సెప్టెంబర్ 18, 2025
  • రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Banner)

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన హిందీ వెబ్ సిరీస్ “బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్”. టాప్ బాలీవుడ్ స్టార్స్ అందరూ క్యామియో రోల్స్ చేసిన ఈ సిరీస్ మీద చాలా మంది దృష్టి ఉంది. కంటెంట్ పరంగా ఈ సిరీస్ ఏమేరకు ఆకట్టుకుంది? దర్శకుడిగా ఆర్యన్ ఖాన్ అలరించగలిగాడా? అనేది చూద్దాం..!!

The Bads of Bollywood Review

కథ: నటించిన మొదటి సినిమా “రివాల్వర్”తో పెద్ద స్టార్ అయిపోతాడు ఆస్మాన్ సింగ్ (లక్ష్య). ఒక్కసారిగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోతాడు. అతని స్టార్ డమ్, బిహేవియర్ అతడ్ని లైమ్ లైట్ లో ఉండేలా చేస్తుంది.

కట్ చేస్తే.. సెకండ్ సినిమా విషయంలో తనను లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ తో వచ్చిన సమస్యల కారణంగా చిక్కుల్లో పడతాడు అస్మాన్.

అసలు ఆస్మాన్ కి వచ్చిన సమస్య ఏమిటి? ఒకప్పటి స్టార్ హీరో అజయ్ తల్వార్ ఎందుకని ఆస్మాన్ ను సినిమాల్లో నటించనివ్వకుండా అడ్డుకుంటాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్” వెబ్ సిరీస్.

నటీనటుల పనితీరు: ఆల్రెడీ “కిల్” సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకున్న లక్ష్యకి ఈ సినిమా కేక్ వాక్ లాంటిది. చాలా ఈజ్ తో చేసేశాడు. అతడి స్క్రీన్ ప్రెజన్స్ కూడా బాగుంది.

బాబీ డియోల్ మరోసారి నెగిటివ్ రోల్లో అలరించాడు. అయితే.. అతడి పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ అనేది అంతగా ఎగ్జైట్ చేయడు.

రాఘవ్ జుయల్ స్నేహితుడి పాత్రలో కామెడీతోపాటు ఎమోషన్ కూడా చక్కగా వర్కవుట్ చేశాడు.

మోనా సింగ్, మనీష్ చౌదరి, అన్య సింగ్ ల పాత్రలు ఆకట్టుకుంటాయి. రజత్ బేడీ క్యారెక్టర్ ద్వారా పండించిన కామెడీ కూడా బాగానే పండింది.

ఇక లెక్కలేనన్ని క్యామియోలు ఉన్నాయి. రాసుకుంటూ వెళ్తే చాంతాడంత ఉంటుంది.

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవు. ఒక కాస్ట్లీ వెబ్ సిరీస్ ఫీల్ ఇవ్వడంలో ఎక్కడా తగ్గలేదు మేకర్స్. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్ వంటి అంశాలన్నీ బాగున్నాయి.

అయితే.. సమస్యల్లా కథతోనే. ఇదేమీ కొత్త కథ కాదు, ఎప్పుడో 2017లో వచ్చిన “సోలో” సినిమాలోని ఒక కథలో దుల్కర్ ఆల్రెడీ ఈ తరహా ట్విస్ట్ తో షాక్ ఇచ్చాడు. అప్పుడే జనాలు షాక్ అయ్యి షేక్ అయిపోయారు. అందువల్ల ముఖ్యంగా సౌత్ లో ఈ సిరీస్ చూసేవాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ రాదు. మరి అంత పెద్ద రైటింగ్ టీమ్ & నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఈ విషయాన్ని ఎందుకని సీరియస్ గా తీసుకోలేదో అర్థం కాలేదు. అలాగే.. 7 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ లో సాగతీత మరీ ఎక్కువగా ఉంది. చాలా సీన్లు కట్ చేసేసినా పెద్దగా నష్టం ఏమీ ఉండదు.

ఆర్యన్ ఖాన్ ఒక స్టైలిష్ మేకర్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు కానీ.. ఒక దర్శకుడిగా అతడి మార్క్ ఏంటి, అతడి ఆలోచనాధోరణి ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అలాగే.. హీరో మినహా ఎవరికీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ లేవు. ఓ రెండు పాత్రలను ఎస్టాబ్లిష్ చేయకపోవడమే బెటర్ అయినప్పటికీ.. మిగతా పాత్రలు ఏదో కథలో ఉన్నాయి అన్నట్లుగా ఉంటాయి తప్పితే, ఎందుకు అనేది క్లారిటీ లేదు. దాదాపు 5 గంటల సిరీస్ లో ఆ క్లారిటీ లేకపోవడం అనేది గమనార్హం. ఓవరాల్ గా.. దర్శకుడిగా ఆర్యన్ ఖాన్ అలరించలేకపోయాడనే చెప్పాలి.

విశ్లేషణ: కథలో షాక్ వేల్యు అనేది కచ్చితంగా ఉండాల్సిందే. అయితే.. ఆ షాక్ ఫ్యాక్టర్ ఎంత కొత్తగా ఉంది అనే విషయం కూడా చాలా కీలకం. ఆల్రెడీ చూసేసిన విషయానికి ఎందుకు షాక్ అవుతాం. ఒకవేళ బాలీవుడ్ కి ఇది పెద్ద షాక్ అనుకుంటే కూడా పొరపాటే. ఎందుకంటే.. రీసెంట్ గా వచ్చిన చాలా వెబ్ సిరీసుల్లోనూ ఆ తరహా ట్విస్ట్ ను చూసేసి ఉన్నారు. షారుక్ ఖాన్ కొడుకు కాబట్టి ఈ తరహా సింపుల్ కథతో ఇంతమంది క్యామియో రోల్స్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించగలిగాడు ఆర్యన్ ఖాన్.

ఉన్న క్యామియోల్లో ఇమ్రాన్ హష్మీ ఒక్కటే బాగా పేలింది. మిగతావి రెగ్యులర్ గానే ఉన్నాయి. అయితే.. బాలీవుడ్ వ్యవస్థలోని లోటుపాట్లను, డార్క్ సీక్రెట్స్ ను కామికల్ గా చూపించిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. ఆ స్పూఫ్ లు మినహా సిరీస్ ప్రేక్షుకుల్ని ఆకట్టుకోవడం కాస్త కష్టమే.

ఫోకస్ పాయింట్: బిల్డప్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus