‘నేను చంపేస్తా… వాళ్లందరినీ చంపేస్తా’… ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత చెప్పే మొదటి డైలాగ్. వెబ్ సిరీస్‌లో సమంత ఎవరెవర్ని చంపిందో తెలియదు కానీ… ఆ ఒక్క డైలాగ్‌లో అభిమానుల మనసుల్ని కట్టిపడేసింది. అదేంటి చంపేస్తా అంటే మనసుల్ని మెప్పించింది అంటారు… అదేలా! అనుకుంటున్నారా. చక్కనమ్మా చిక్కితేనే అందం కాదు… చక్కనమ్మ చంపేస్తా అన్నా కూడా అందమే. ఈ వెబ్‌సిరీస్‌తో తొలిసారిగా సమంత వెబ్ ప్రపంచంలోకి ఎంటర్ అవుతోంది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం!
‘ద ఫ్యామిలీ మ్యాన్’ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో ఇరగొట్టేశారు. ప్రియమణి అయితే గృహణిగా అదరగొట్టేసింది. తీవ్రవాదులు, గూఢచర్యం, భద్రతాదళాల కాంబినేషన్‌లో అదిరిపోయే సిరీస్ అది. దాంతోపాటే ఫ్యామిలీ ఎమోషన్స్, మధ్యతరగతి కుటుంబాల తత్వం కూడా చూపిస్తారు. ఇప్పుడు సీక్వెల్‌లో కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి మరింత కలరింగ్ యాడ్ అవుతోంది… సమంత రూపంలో.
శ్రీకాంత్ (మనోజ్ బాజ్‌పాయ్) ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగం విడిచిపెట్టి సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకి చేరుతాడు. అయితే ఆ పనిలో ఎక్కడా ఆసక్తి చూపించడు. ఎవరైనా స్నేహితుడు ఫోన్ చేసి ఫలానా క్రైమ్ ఆపరేషన్‌లో ఉన్నాను అని చెబితే మురిసిపోయి… అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలని ఆశపడుతుంటాడు. భార్య సుచిత్రం (ప్రియమణి) చెప్పినట్లు కుటుంబంతో గడుపుతున్నా ఎక్కడా ఆసక్తిగా ఉండడు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగమే గుర్తొస్తుంటుంది. ఈలోగా దేశంలోకి రాజి (సమంత) అనే తీవ్రవాది ఎంటర్ అవుతుంది. దేశంలో భారీగా ఏదో విధ్వంసం చేయడాని ప్లాన్ చేస్తారు. దానిని శ్రీకాంత్ పసిగడతాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఎలా ఆ విధ్వంసం ఆపాడు అనేదే ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ కథ. సిరీస్ కథ కూడా.
ఇక ట్రైలర్ సంగతి చూస్తే… మనోజ్ బాజ్‌పాయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన సెటిల్డ్, ఎమోషనల్ యాక్టింగ్‌తో వావ్ అనిపించాడు. ప్రియమణి యాస్‌యూజువల్. ఇక చెప్పాల్సింది సమంత గురించే. ట్రైలర్‌లో సమంత కనిపించిన కొన్ని షాట్సే అయినా… ఆమె ముఖంలో ఇంటెన్సిటీ సూపర్‌గా కనిపిస్తోంది. యాక్షన్ సీన్స్ కూడా కొన్ని చేసినట్లుంది. డైలాగ్ మాడ్యులేషన్‌లో తమిళ వాసన వస్తోంది. అయితే ఆమె పాత్ర తమిళ యువతి కాబట్టి సరిపోతుంది. ఇక ఫైట్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ ఎలాగూ బాగుంటాయి. అన్నీ చెప్పేశాం రిలీజ్ డేటే చెప్పాలి కదా… వచ్చే నెల నాలుగు. అవును ఇంకో 16 రోజుల్లో చూసేయొచ్చు.