పాన్ ఇండియా రేంజ్ లో ఈమధ్య ప్రతీ ఇండస్ట్రీ నుంచి బిగ్ బడ్జెట్ సినిమాలు పుట్టుకొస్తున్నాయి. ఇక తాజాగా ఈ కోవలోకి చేరిన మరో సినిమా ‘అశ్వత్థామ’. తొలుత ప్రభాస్ (Prabhas) లేదా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ప్రధాన పాత్రలో నటిస్తారని వార్తలొచ్చిన ఈ ప్రాజెక్ట్, చివరికి షాహిద్ కపూర్ (Shahid Kapoor) చేతికి వెళ్లింది. 500 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను పూజా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనుంది. ప్రభాస్ చేస్తే బాగుండేది అనే కామెంట్స్ గట్టిగానే వచ్చాయి. కానీ ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు.
కాబట్టి మేకర్స్ మొదట అనుకున్నప్పటికి ఆ తరువాత ఎక్కువ ప్రయత్నం చేయలేదు. ఇది అంతర్జాతీయ స్థాయి ఫాంటసీ-యాక్షన్ డ్రామాగా రూపొందించాలని దర్శకుడు సచిన్ బి. రవి ప్లాన్ చేశారు. మార్చిలో అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో సినిమాను ఘనంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ పలు దేశాల్లో షూటింగ్ జరపాలని, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో గ్రాండియర్ గా రూపొందించాలని నిర్మాతలు మొదట నిర్ణయించారు. కానీ ప్రీ-ప్రొడక్షన్ దశలోనే బడ్జెట్ అదుపు తప్పడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
సమకాలీన అంశాలు మిళితం చేసిన మహాభారతంలోని అశ్వత్థామ కథకు సంబంధించిన ప్రాజెక్ట్ కోసం అవసరమైన నిధులు సమకూర్చడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతర్జాతీయ స్థాయి షూటింగ్ ప్రదేశాలు, గ్రాఫిక్స్, లాజిస్టిక్స్ పరంగా ఈ సినిమా చాలా క్లిష్టతరమైందని టాక్ వినిపిస్తోంది. చివరికి పూజా ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారడంతో సినిమాను నిలిపివేయడం తప్పలేదు. ఇది నిర్మాత వాషు భగ్నానిపై మరింత ఒత్తిడిని తెచ్చింది.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం షాహిద్ కపూర్ దర్శకుడు విశాల్ భరద్వాజ్‌తో కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. అశ్వత్థామ చిత్రంలో అమెజాన్ స్టూడియోస్, పూజా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారిక ప్రకటనలు చేయవలసి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. ఇటీవల ‘కల్కి 2898 ఏడి’లో(Kalki 2898 AD) అశ్వత్థామ పాత్ర దేశవ్యాప్తంగా మంచి స్పందన పొందింది. మరి ఈ ఫుల్ స్టోరీ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.