శింబు-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం “ది లైఫ్ ఆఫ్ ముత్తు” గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో తెరకెక్కగా.. తెలుగులో అనువాదరూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ టేకింగ్ ప్రత్యేక ఆకర్షణలుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: సొంత ఊర్లో బ్రతకానికి కష్టపడుతూ.. తన తల్లి కోసం ముంబాయి వస్తాడు ముత్తు (శింబు). అయితే తాను పనిచేయడానికి వచ్చిన పరోటా షాప్ లో పరోటాలు చేయడమే కాదు.. బాస్ లు చెబితే హత్యలు కూడా చేయాల్సి వస్తుంది అని లేటుగా తెలుసుకుంటాడు. ఆ కూపం నుండి బయటపడాలనుకొనే సమయానికి.. పరోటా షాప్ పై దాడి చేసిన కుట్టి భాయ్ గ్యాంగ్ ను అంతమోందించి.. డాన్ కి ఫెవరెట్ బాడీగార్డ్ గా మారతాడు. అలా మొదలైన ముత్తు ఎదుగుదల.. అతడ్ని డాన్ గా ఎలా మార్చింది అనేది “ది లైఫ్ ఆఫ్ ముత్తు” కథాంశం.
నటుల పనితీరు: శింబు ఫిజికల్ గా బాగా కష్టపడిన అతితక్కువ సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాలో అతడు చూపిన వేరియేషన్స్ & ఎమోషన్ ను డీల్ చేసిన విధానం బాగుంది. నటుడిగా అతడి ఎదుగుదలకు ఈ చిత్రం మరో ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే.. చాలా సెటిల్డ్ గా వయొలెన్స్ ను ఎలివేట్ చేసిన విధానం కూడా సినిమాకి ప్లస్ ఐయింది. సిద్ధి చూడ్డానికి సమీరా రెడ్డిలా ఉండడం ఒక ప్లస్ అయితే..
నటించిన సన్నివేశాల్లో మెచ్యూర్డ్ గా కనిపించడం ఇంకో ప్లస్ పాయింట్. అయితే.. శింబుతో కెమిస్ట్రీ మాత్రం అంతలా పండలేదు. తల్లి పాత్రలో రాధిక, డాన్ పాత్రల్లో నటించిన వ్యక్తులు పాత్రల్లో ఒదిగిపోయారు. మలయాళ నటుడు శ్రీధరన్ పాత్ర నిడివి తక్కువే అయినా.. సదరు పాత్ర ద్వారా కథా గమనాన్ని ఎలివేట్ చేసిన విధానం బాగుంది.
సాంకేతికవర్గం పనితీరు: ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్. రెహమాన్ సంగీతాన్ని గౌతమ్ మీనన్ యుటిలైజ్ చేసుకున్న విధానం, నేపధ్య సంగీతాన్ని సన్నివేశానికి తగ్గట్లు వినియోగించుకున్న తీరు భలే ఉంది. ఇక పాటల ప్లేస్ మెంట్ లో స్పెషలిస్ట్ అయిన గౌతమ్ మీనన్ రొమాంటిక్ సాంగ్ ను పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది. సిద్ధార్ద్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, డి.ఐ & లైటింగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్.. ఒక రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామాను ఆసక్తికరంగా ఒక సర్వైవల్ డ్రామాలా తెరకెక్కించిన విధానం బాగుంది. కథలో ఉన్న మల్టీపుల్ లెటర్స్ ను చాలా నీట్ గా, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా స్ట్రయిట్ స్క్రీన్ ప్లే తో నడిపిస్తూ.. హీరో క్యారెక్టర్ కి ఇచ్చిన సింపుల్ ఎలివేషన్స్ బాగున్నాయి.
హీరో మనస్తత్వం ఎలాంటిది, అతడిలోని ధైర్యం ఎలాంటిది అనే విషయాలను ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పిన విధానం గౌతమ్ మీనన్ సీనియారిటీని మరోసారి ప్రూవ్ చేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్రం గౌతమ్ మీనన్ కమ్ బ్యాక్ ఫిలిం అని చెప్పాలి. చాన్నాళ్ల తర్వాత గౌతమ్ మీనన్ కథకుడిగా-దర్శకుడిగా సఫలీకృతుడయ్యాడు. అన్నిటికంటే ముఖ్యంగా.. ఒకేసారి ముంబై వచ్చిన ముత్తు-శ్రీధరన్ ల జీవితాలు వాళ్ళు ఎంచుకున్న దారులు, తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి తీరం చేరాయి అనే విషయాన్ని చాలా సింపుల్ గా ఎలివేట్ చేసిన విధానం హైలైట్ గా నిలుస్తోంది.
విశ్లేషణ: రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామాకు సింపుల్ ఎలివేషన్స్ & ఎమోషన్స్ జోడించిన చిత్రం “ది లైఫ్ ఆఫ్ ముత్తు”. శింబు నటన, రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ టేకింగ్ కోసం కచ్చితంగా ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5/5