నాగార్హున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 3’ మొదలైంది. టీవీ సీరియల్స్, యూట్యూబ్, న్యూస్ ఛానల్, అలాగే సినిమాల్లో పేరుతెచ్చుకున్న వారిని ఈసారి ‘బిగ్ బాస్ 3’ రియాలిటీ షోలో పార్టిసిపెంట్స్ గా ఎంచుకున్నారు. అలాంటి సెలబ్రిటీస్ ను కంట్రోల్ చేయాలంటే…. ‘బిగ్ బాస్’ వాయిస్ సున్నితంగా మర్యాదగా ఉంటే సరిపోదు కదా…! మిలిటరీ అధికారిలా గంభీరమైన వాయిస్ ఉండాలి. మన సినిమా భాషలో చెప్పాలంటే.. సాయి కుమార్ లా బేస్ వాయిస్ ఉండాలన్నమాట. హిందీ ‘బిగ్ బాస్’ లో అతుల్ కపూర్ గొంతు బాగా పాపులర్ అయింది. మరి తెలుగులో కూడా అటువంటి గొంతే కావలి కదా. అందుకే ‘బిగ్ బాస్1’ కు నిర్వాహకులు వందలమంది ఆడిషన్స్ చేసి ఒకతన్ని పట్టుకున్నారు. రెండో సీజన్ కు ఈయనే చెప్పాడు. ఇక మూడో సీజన్ కు కూడా ఈయన్నే కంటిన్యూ చేస్తున్నారు ‘స్టార్ మా’ వారు.
ఇప్పుడు కూడా అదే గొంతు అదరకొడుతోంది. ఇప్పుడు మళ్ళీ అతనెలా ఉంటాడో చూడాలని అందరికీ ఆత్రుత పెరిగింది. అందుకే ఆ బిగ్ బాస్ ఎవరో ఆరా తీస్తే అసలు విషయం బయటికి వచ్చింది. హిందీ టీవీ సీరియళ్లకు డబ్బింగ్ చెప్పే రాధాకృష్ణ అనే ఆర్టిస్టు ‘బిగ్ బాస్’ అని తెలిసింది. అంతేకాదు ఈయన గతంలో టాలీవుడ్ సినిమాల్లో పరభాషా విలన్లకు కూడా డబ్బింగ్ చెప్పారట. అలాగే అతని వాయిస్ ని పోలి ఉండే మరో ఆర్టిస్టు శంకర్ ని కూడా స్టాండ్ బై గా తీసుకున్నారని తెలుస్తుంది. ఈ శంకర్… ‘స్టార్ మా’ చానల్లో ప్రసారమయ్యే కొన్ని హిందీ సీరియళ్ల… తెలుగు డబ్బింగ్ కార్యక్రమంలో భాగం పంచుకునేవాడంట. వీరిద్దరూ ఈ సీజన్ కు కూడా ‘బిగ్ బాస్’ గా వ్యవహరిస్తున్నారట. వీరి ఫోటోలు బయటికి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సోషల్ మీడియాకి చిక్కాయి. ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి.