డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్ ఓ, పిఎక్స్ డి సంస్థలకు నిర్మాతలకు మధ్య గత శుక్రవారం బెంగుళూరులో జరిగిన చర్చలు విఫలం కావడంతో నాలుగు భాషల చిత్ర నిర్మాతలు మార్చి 2 నుంచి థియేటర్స్ బంద్ ప్రకటించారు. ఆ మూడు డిజిటల్ సంస్థలకు సినిమా కంటెంట్ ఇవ్వకూడదని నిర్ణయించారు. అయితే ఈ థియేటర్ల మూసివేత కార్యక్రమం మార్చి 2 నుంచే ఎందుకు? అనుకున్నారని కొంతమందిలో చర్చ మొదలయింది. ఇందుకు పరిశ్రమ పెద్దలు చెప్పిన సమాధానం ఏమిటంటే..? మార్చిలో ఎగ్జామ్ సీజన్ నడవనుంది. అందరికీ పరీక్షలు కనుక పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావు.
తెలుగులో అయితే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నటించిన రంగస్థలం సినిమా మాత్రమే రిలీజ్ కానుంది. అది కూడా మార్చి 30 న. కాబట్టి థియేటర్లన్నీ మూసేయవచ్చు. అందుకే మార్చిలో థియేటర్లు క్లోజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ బంద్ వల్ల డిజిటల్ సంస్థలు దిగి వస్తాయా?.. రేట్లు తగ్గిస్తాయా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. నెల రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకుంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా సినీ పరిశ్రమలు భారీ నష్టాన్ని చూడక తప్పదు.