కోటా శ్రీనివాసరావు.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1978లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈయన… తరువాత ‘బాబాయ్ అబ్బాయ్’ ‘తాండ్ర పాపారాయుడు’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ‘అహనా పెళ్ళంట’ చిత్రం ఈయనకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అందులో పిసినారి ‘లక్ష్మీ పతి’ పాత్రలో ఈయన పరకాయ ప్రవేశం చేశారనే చెప్పొచ్చు. జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని దివంగత స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు గారు నిర్మించారు. ‘అహానా పెళ్ళంట’ చిత్రం కథ మొత్తం కోటా శ్రీనివాసరావు పాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబట్టి.. ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పొచ్చు.
ఇక ఆ చిత్రం తరువాత ఈయన వెనక్కు తిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతూ వచ్చారు. అగ్ర హీరోలందరితో ఈయన నటించారు. కమెడియన్ గా విలన్ గా, విలక్షణ నటుడుగా ఈయన పోషించినన్ని పాత్రలు మరే నటుడు చెయ్యలేడు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కోటా శ్రీనివాసరావు సొంత ఊరు కృష్ణాజిల్లాకు చెందిన కంకిపాడు. విజయవాడ కు అతి సమీపంగా ఉన్న ఊరు ఇది. నాటకాల పై ఉన్న ఇంట్రెస్ట్ వల్ల చెన్నై బయలుదేరి ఎంతో కష్టపడి పని చేసి పైకి వచ్చారు కోటా శ్రీనివాస రావు.
అతని సొంత ఊరు అంటే ఇతనికి చాలా ఇష్టమట.ఇతని కొడుకుని కూడా ప్రయోజకుడిని చేసి… తన సొంత ఊరుకి వెళ్ళి సెటిల్ అవుదామని ఈయన అనుకున్నారట. కానీ అతను ఒక బైక్ యాక్సిడెంట్ వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అతని మనువడి కోసమే కోటా హైదరాబాద్ లోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కోటా శ్రీనివాస రావు కి ఎక్కువ అవకాశాలు రావడం లేదు. దాని గురించి కూడా ఆయన ఎంతో బాధపడుతూ ఇటీవల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.