దీపావళి సంబరాలు అప్పుడే మొదలైపోయాయి. కానీ.. ఈ దీపావళికి ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా విడుదలవ్వకపోతుండడం గమనార్హం. ఈవారం రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ రేస్ లో నిలబడడం ఒకరకంగా చెప్పాలంటే బాధపడాల్సిన విషయమే. డబ్బింగ్ సినిమాలు విడుదలవ్వడం తప్పు కాదు.. కానీ అసలు ఒక్క తెలుగు సినిమా కూడా ఈ పండగను క్యాష్ చేసుకోనే స్థాయిలో లేకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. మామూలు శుక్రవారాల్లో ఇక మళ్ళీ డేట్ దొరకదు అన్నట్లు పోటీపడి మరీ సినిమాలను విడుదల చేసే మన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్.. ఇలా చాలా ముఖ్యమైన పండగను ఎలా వదిలేశారు అనేది వాళ్ళకే తెలియాలి.
ఇకపోతే.. ఈ శుక్రవారం “విజిల్, ఖైదీ” వంటి డబ్బింగ్ సినిమాలతోపాటు హిందీ సినిమాలు “హౌస్ ఫుల్ 4, సాండ్ కి ఆంఖ్, మేడిన్ చైనా” కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్నాయి. సో, ఈవారం మన తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ మరియు హిందీ సినిమాలే గతి అన్నమాట.