తొలిప్రేమ‌

  • February 10, 2018 / 07:17 AM IST

“ఫిదా”తో సూపర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ”తొలిప్రేమ”. “స్నేహగీతం” చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న విడుదలవ్వాల్సి ఉండగా.. ఒకరోజు లేట్ గా నేడు (ఫిబ్రవరి 10) విడుదలైంది. ట్రైలర్ రిలీజ్ వరకూ ఏమాత్రం బజ్ లేని ఈ చిత్రం సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అనంతరం విశేషమైన ఆసక్తిని రేకెత్తించింది. స్వచ్చమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : జీవితంలో మనకి తారసపడే కొన్ని వందల, వేల జనాల్లో కేవలం ఒకరిద్దరికి మాత్రమే మనం కనెక్ట్ అవుతాం. అలా తొలిసారి ఎవరినైతే మనస్ఫూర్తిగా ప్రేమిస్తామో అదే మన “తొలిప్రేమ”. ఇది కూడా ఆదిత్య (వరుణ్ తేజ్), వర్ష (రాశీఖన్నా)ల తొలిప్రేమ. రైలు ప్రయాణంలో యాధృచికంగా కలుసుకొన్న ఈ ఇద్దరూ తొలి పరిచయంలోనే ప్రేమించుకొంటారు. అయితే.. మనసులో ఏదైనా అనుకొంటే ఎలాంటి జంకూబొంకూ లేకుండా చెప్పేసే ఆదిత్య పరిచయమైన గంటలోనే వర్షకి “ఐ లవ్ యూ” చెప్పేస్తే.. ఏ విషయాన్నైనా పలువిధాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకొనే వర్ష మాత్రం “ముందు ప్రయాణం మొదలెడదాం” అంటూ తన ఇష్టాన్ని మనసులోనే దాచుకొంటుంది. అలా మొదలైన ఆదిత్య-వర్షల ప్రయాణ గాధ కోపతాపాలతో, రాగద్వేషాలతో ఏ తీరానికి చేరింది అనేది “తొలిప్రేమ” కథాంశం.

నటీనటుల పనితీరు : కెరీర్ ప్రారంభం నుంచి నటన పరంగా మంచి పరిణితితో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ “తొలిప్రేమ”లో భిన్న భావాలను వ్యక్తీకరించడం, జీవితంలోని రెండు డిఫరెంట్ స్టేజస్ లో వైవిధ్యం చూపడంలో తన పర్ఫెక్షన్ చూపించాడు. కాలేజ్ స్టూడెంట్ గా, యూనివర్సిటీ స్కాలర్ గా, యంగ్ & డైనమిక్ జాబ్ హోల్డర్ గా.. అన్నిటికీ మించి స్వచ్చమైన ప్రేమికుడిగా అలరించాడు వరుణ్ తేజ్. అతడి కెరీర్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. పరిచయ చిత్రమైన “ఊహలు గుసగుసలాడే” తర్వాత రాశీఖన్నా అందంతో కాక నటనతో మెప్పించిన చిత్రం “తొలిప్రేమ”. వర్ష పాత్రలో మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచింది. ఇకనైనా దర్శకులు ఆమెను ఒక గ్లామర్ డాల్ గా వాడడం మాని మంచి క్యారెక్టర్స్ రాయాలని కోరుకొందాం. చాలారోజుల తర్వాత సుహాసిని మంచి పాత్రలో కనపడ్డారు. క్యాస్ట్ పిచ్చి ఉన్న ఎన్నారైగా సీనియర్ నరేష్, ఫ్రెండ్స్ గా ప్రియదర్శి, హైపర్ ఆది, అపూర్వ శ్రీనివాసన్ పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు : “కిక్, రేసుగుర్రం” చిత్రాల తర్వాత తమన్ నుంచి వచ్చిన సూపర్ హిట్ ఆల్బమ్ “తొలిప్రేమ”. రొటీన్ ట్యూన్స్, డప్పు సౌండ్లతో ఇప్పటివరకూ చిరాకుతెప్పించిన తమన్ “తొలిప్రేమ”లోని మెలోడీ సాంగ్స్ తో మనసుల్ని తాకితే, నేపధ్య సంగీతంతో హృదయాన్ని తడి చేశాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఒక ప్లెజంట్ ఫీలింగ్ రావడానికి తమన్ నేపధ్య సంగీతం ముఖ్యకారణం. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. సినిమా అంత సహజంగా ఆస్వాదించేలా ఉండడానికి మెయిన్ రీజన్ కెమెరా వర్క్. హైద్రాబాద్ లోని లొకేషన్స్ ను కూడా లండన్ అంత అందంగా చూపించగలిగాడు. ముఖ్యంగా దర్శకుడు వెంకీ అట్లూరి పేపర్ పై రాసుకొన్న కథను తెరపై చూపడంలో జార్జ్ మ్యాజిక్ చేశాడు.

నవీన్ నూలి లీనియర్ స్క్రీన్ ప్లేతో నడిచే సినిమాని ప్రతి ప్రేక్షకుడికీ అర్ధమయ్యే రీతిలో ఎడిట్ చేసిన విధానం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. సి.జి వర్క్ పరంగా ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేది. ఒక కొత్త దర్శకుడి కథను నమ్మి ఖర్చుకి వెనకాడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు, ఆ దర్శకుడి మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసిన దిల్ రాజుకి అభినందనలు తెలపాలి. వారి సపోర్ట్ లేనిదే “తొలిప్రేమ” ఈ స్థాయి హిట్ సాధించేది కాదు.

“స్నేహగీతం”తో కథానాయకుడిగా కెరీర్ ప్రారంభించి అనంతరం “కేరింత” చిత్రంతో డైలాగ్ రైటర్ గా మారి “తొలిప్రేమ’తో దర్శకుడిగా ప్రేక్షకులని పలకరించిన వెంకీ అట్లూరి ప్రతిభ కంటే తాను కష్టపడి రాసుకొన్న కథను నమ్ముకొని కమర్షియల్ అంశాల జోలికిపోకుండా సిన్సియారిటీతో రాసుకొన్న స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కథలో ఎంత క్లారిటీ ఉందో.. పాత్రల వ్యవహార శైలిలోనూ అంతే క్లారిటీ ఉంది. ముఖ్యంగా బ్రేకప్-ప్యాచప్ లకి మధ్య వెంకీ నడిపిన డ్రామా, అందుకోసం అతడు అల్లిన సన్నివేశాలు థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడ్ని ఆద్యంతం ఆకట్టుకొంది. ముఖ్యంగా రొమాన్స్ ను స్వచ్ఛంగా ఎలాంటి అసభ్యత లేకుండా పిక్చరైజ్ చేసుకొన్న తీరు, కార్ లో కిస్ సీన్ ను సెన్సిబుల్ గా రాసుకొన్న విధానం దర్శకుడి ప్రతిభకు నిదర్శనాలు. తెలుగులో “మళ్ళీ రావా” తర్వాత వచ్చిన సిన్సియర్ లవ్ స్టోరీగా “తొలిప్రేమ”ను చెప్పుకోవచ్చు. ఇక వెంకీ అట్లూరి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు అప్గ్రేడ్ వెర్షన్ లా దొరికాడు తెలుగు చిత్రసీమకు. ఇంతియాజ్ అలీ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాల విషయంలోనూ ఇదే సిన్సియారిటీతో వ్యవహరిస్తాడని, ఇంకొన్ని మంచి తెలుగు సినిమాలు రూపొందిస్తాడని ఆశిద్దాం.

విశ్లేషణ : వరుసబెట్టి విడుదలవుతున్న రొటీన్ రొట్ట సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన తెలుగు ప్రేక్షకులకు ఒక స్వచ్చమైన సినిమా చూశామన్న అనుభూతి కలిగించే చిత్రం “తొలిప్రేమ”. తమ తొలిప్రేమ అనుభూతులను గుర్తు తెచ్చుకోవడానికి, కొన్ని మధుర క్షణాలను ఆస్వాదించడానికి.. అన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి డీవియేషన్స్ లేని ఒక మంచి సినిమా చూడాలనుకొంటే తప్పకుండా “తొలిప్రేమ” చూడాల్సిందే.

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus