మన నందమూరి నాటసింహం బాలకృష్ణ తాను నటించే సినిమాలకు మాత్రమే కాదు.. తాను అతిధిగా విచ్చేసే వేడుకలకు కూడా ముహూర్తాలు పెడతాడన్న విషయం తెలిసిందే. అలాంటిది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన స్వంత బ్యానర్ లో నిర్మించిన “ఎన్టీఆర్” బయోపిక్ విషయంలో ఇంకెంత బలమైన ముహూర్తం పెట్టి ఉంటాడో ఊహించుకోవచ్చు. మరి బాలయ్య సెంటిమెంట్ ను ఈసారి రామ్ చరణ్ & వెంకీలు కూడా సీరియస్ గా తీసుకొన్నట్లున్నారు. అందుకే వాళ్ళు కూడా బాలయ్య అడుగుజాడల్లో నడుస్తూ.. తమ సినిమాలను కూడా బాలయ్య పెట్టిన ముహూర్తానికే సెన్సార్ పూర్తి చేయించారు.
బాలకృష్ణ నటించి, నిర్మించిన “ఎన్టీఆర్ కథానాయకుడు”, రామ్ చరణ్ “వినయ విధేయ రామ”, వెంకీ-వరుణ్ ల “ఎఫ్ 2” సినిమాల సెన్సార్ లు ఇవాళే పూర్తయ్యాయి. ఉదయం ఎన్టీఆర్ బయోపిక్, మద్యాహ్నం ఎఫ్2, సాయంత్రం వినయ విధేయ రామ సెన్సార్ లు పూర్తయ్యాయి. ఈ మూడు సినిమాలు ఒకటి తర్వాత మరొకటి వరుసబెట్టి విడుదలవుతుండడంతో రిలీజ్ టైమ్ లో టెన్షన్ ఉండకూడదని ఇవాళే (జనవరి 4) సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇలా మూడు పెద్ద సినిమాలు ఒకేసారి సెన్సార్ పూర్తవ్వడం అనేది ఈమధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. సొ, ఈ సినిమాలకు సంబంధించిన సగం రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసినట్లే. మరి ప్రేక్షకులు సినిమాలను ఎలా ఆదరిస్తారు అనేది తెలియాలంటే జనవరి 12 వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే.. అప్పటికి కానీ ఫైనల్ రిజల్ట్ తెలియదు.