ఈ సంక్రాంతికి (Sankranti) భారీ బడ్జెట్ సినిమాల మధ్య పోటీ హోరాహోరీగా ఉండనుంది. రామ్ చరణ్ (Ram Charan) , నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), విక్టరీ వెంకటేష్‌ల (Venkatesh) తాజా చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించబోతున్నాయి. దీంతో టిక్కెట్ ధరల పెంపుపై చర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతి మేరకు టిక్కెట్ ధరల పెంపు అమలవుతుందా అన్న ప్రశ్న ఆసక్తి కలిగిస్తోంది. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) భారీ బడ్జెట్‌తో రూపొందిన పాన్ ఇండియా చిత్రం.
శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి టిక్కెట్ ధరలు మల్టీప్లెక్స్‌లలో రూ. 175 వరకు ఉండబోతున్నాయని టాక్. బెనిఫిట్ షోల టిక్కెట్ ధరలు రూ. 600 వరకు చేరే అవకాశం ఉంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి టిక్కెట్ ధరల పెంపు అత్యవసరం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) కూడా సంక్రాంతి బరిలో నిలిచిన మరో ముఖ్య చిత్రం. ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్‌లలో రూ. 110, మల్టీప్లెక్స్‌లలో రూ. 135 పెంపు ఉంటుందని భావిస్తున్నారు.
బెనిఫిట్ షో ధరలు కూడా భారీగానే ఉండే సూచనలు ఉన్నాయి. ఉదయం 4 గంటలకే ప్రత్యేక షోలు ప్రారంభమవుతుండటంతో, బాలయ్య అభిమానులు థియేటర్లకు పెద్ద ఎత్తున తరలి రావడం ఖాయం. విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రం కూడా వీరిలో పోటీ పడనుంది. ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్‌లలో రూ. 75, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 అదనపు ఛార్జ్ ఉండబోతుందని సమాచారం. తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించగలదని అంచనా.
తెలంగాణలో పరిస్థితి ఇంకా స్పష్టతకు రాలేదు. టిక్కెట్ ధరల పెంపు విషయంలో అక్కడి ప్రభుత్వం గానీ థియేటర్ యాజమాన్యాలు గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టిక్కెట్ ధరల పెంపుకు అనుమతి లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ మూడు పెద్ద సినిమాల విజయవంతం అయ్యేందుకు కంటెంట్ కీలకం. టిక్కెట్ ధరల పెంపుతో ప్రారంభ వసూళ్లు రికార్డులు సృష్టించినప్పటికీ, చిత్రాలు ప్రేక్షకుల మన్నన పొందితేనే దీర్ఘకాలం థియేటర్లలో నిలవగలవు.